హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకే సీఎం కేసీఆర్ ఆర్టీసి కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్నారని వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆర్టీసిని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయమనీ చెప్పిన కేసీఆర్.. అందుకు అనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామని తెలిపారు. అంతేకాకుండా మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరించడం కూడా వివేకమైన చర్య కాదని ఆయన తేల్చిచెప్పారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయా ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు.
Also read: ఆర్టీసి కార్మిక సంఘాలకు హైకోర్టు నోటీసులు
''ఆర్టీసి కార్మికులు తాము ఎక్కి కూర్చున్న చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 సంవత్సరాలుగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు, ఎప్పటిలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలొ కూడా సమ్మెకు దిగారు. అయితే, ప్రభుత్వం ఏది వున్నా వీళ్ళ అతిప్రవర్తనలో మాత్రం మార్పు లేదు. ఆర్టీసి బలోపేతం కోసం తీసుకునే పకడ్బందీ నిర్ణయాలకు యూనియన్లు మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయం. పండగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతానికి ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకుండానే ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది సెల్ఫ్ డిస్మిస్‌గానే భావించాల్సి ఉంటుంది'' అని కేసీఆర్ స్పష్టంచేశారు.
Also read : ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ఇంట్లో పాలేర్లు కాదు: ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి
''సమ్మెకు దిగి విధుల నుంచి తొలగిపోయినవారు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయడానికి వీల్లేకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని రాష్ట్ర డీజీపీని ఆదేశించాను. విధుల్లో వున్న 1200 మంది తప్ప పాత సిబ్బంది ఇంకెవరైనా వచ్చి, ఎరితోనైనా దురుసుగా ప్రవర్తించినట్టయితే, వారిపై డీజీపీనే చట్టరీత్యా సరైన చర్యలు తీసుకుంటారు'' అని సీఎం కేసీఆర్ చెప్పారు.