CM KCR: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త కాక రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందనే ప్రచారం సాగుతోంది. బీజేపీ కూడా తెలంగాణలో మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తుందని.. అందుకే కోమటిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయించబోతున్నారని తెలుస్తోంది. కోమటిరెడ్డి జంపింగ్ వార్తతో నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేడి పెరిగింది. అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్ మునుగోడు లీడర్లను ప్రగతి భవన్ కు పిలిపించుకుని సమావేశమయ్యారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని భావిస్తున్న గులాబీ బాస్ అప్పుడే వ్యూహాలకు పదును పెట్టారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అధికార పార్టీకి తీరని నష్టం కల్గించింది. ఆ ఫలితం తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు. మునుగోడు ఉపఎన్నికలో అలాంటి సీన్ రిపీటైతే మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే యోచనలో ఉన్న కేసీఆర్... అప్పుడే రంగంలోకి దిగారని చెబుతున్నారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో కలిసి మునుగోడు నియోజకవర్గ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారని తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలను తెలసుకోవడంతో పాటు ఇంకా ఏం చేయోలో కూడా కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. పార్టీలో ఉన్న విభేదాలపైనా ఫోకస్ చేశారని చెబుతున్నారు. అంతేకాదు గత ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ మండలం ఏర్పాటు సమస్యను గంటలోనే ఆగమేఘాల మీద కొత్త మండల ఏర్పాటు జీవో వచ్చేసింది.
మునుగోడు విషయంలో కేసీఆర్ దూకుడుతో రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే జరగబోయే ఉప ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతం జనాలకు గులాబీ పార్టీ ఇస్తుందనే చర్చ సాగుతోంది. ఈవిధంగా ప్రతిపక్షాల కంటే తాము ముందున్నామనే మెసేజ్ జనంలోకి పంపిస్తుంది. అదే సమయంలో మరో చర్చ కూడా వస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే సంకేతం ఇచ్చిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నుంచే పోటీ చేస్తానని మాట్లాడారు. అది కూడా మునుగోడు నుంచి తాను పోటీ చేస్తానని కేసీఆర్ చెప్పారని నల్గొండ జిల్లా నేతలు తెలిపారు. కేసీఆర్ పోటీ చేయాలని మునుగోడు నియోజకవర్గ నేతలు తీర్మానాలు కూడా చేశారు. కేసీఆర్ పోటీ చేస్తే మునుగోడుతో పాటు నల్గొండ జిల్లా దశ మారుతుందని చెప్పారు. మునుగోడు నుంచి కేసీఆర్ పోటీ చేస్తే స్వాగతిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మునుగోడు నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడంతో.. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.
సీఎం కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించినా.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే. కాని కోమటిరెడ్డి రాజీనామా చేస్తే వచ్చేది ఉప ఎన్నిక. దీంతో త్వరలోనే జరగబోయే ఉప ఎన్నికలో ఎవరిని పోటీ చేయించాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ మరో అంశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అంటే ఈ ఏడాది చివరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుగుతంది. కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఉంది. 2018 తరహాలోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు వెళతారని విపక్ష నేతలు చెబుతున్నారు. దీంతో కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా... కేసీఆర్ ముందస్తుకు వెళితే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండదు. ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచే పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని.. అందుకే ఆ నియోజకవర్గ నేతలతో మీటింగ్ పెట్టారనే చర్చ సాగుతోంది.
Read also: Srisailam Dam:జూలైలోనే నిండిన శ్రీశైలం డ్యాం.. ఇవాళ గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.