తెలంగాణ బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి చరిత్రలోనే తొలిసారిగా ఈ ఉత్సవాలకు గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారి ఆలయం వేదిక కానుంది. ఈ మేరకు దేవాదాయశాఖ ఇప్పటికే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. జులై 15వ తేదిన ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే 29, 30 తేదీల్లో మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జరుగుతాయి.
ఈసారి రూ.కోటి రూపాయల విలువ గల బంగారు బిందెతో అమ్మవారికి బోనం సమర్పించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల పండుగ ఎప్పుడూ ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఆషాఢ మాసంలో మహాదేవి తన పుట్టింటికి వెళుతుందని భక్తుల నమ్మకం; అందుకే భక్తులు ఈ బోనాల పండుగ సమయంలో ఆ దేవదేవిని దర్శించుకుని తమ సొంత బిడ్డే తమ ఇంటికి వచ్చిన తలంపుతో బోనాలను ఆహార నైవేద్యంగా ఆమెకు సమర్పిస్తారు.
సాధారణంగా బోనాలను మోసుకెళ్తున్న స్త్రీలను అమ్మవారు ఆవహిస్తారని ఒక నమ్మకం ఉంది. బోనాల పండుగ సందర్భంలో జనాల గుంపు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ గుడి నుండి ప్రారంభమై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్‌లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ సారి బోనాల సందర్భంగా ఓల్డ్ సిటీ మొదలైన ప్రాంతాల్లో హై ఎలర్ట్ ప్రకటించనున్నారు. అలాగే భారీగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించనున్నారు.