Kcr vs Bandi Sanjay: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్.. దాదాపు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. తన జాతీయ పార్టీపై క్లారిటీ ఇస్తూనే బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీపైనా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దీంతో కేసీఆర్ ఆరోపణలపై వెంటనే రియాక్ట్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు బండి సంజయ్.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తాము ఏం మాట్లాడుకున్నమో... కేసీఆర్ కు ఏం తెలుసని సంజయ్ అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు. జోగులాంబ అమ్మవారిని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. గతంలో హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్ లో బొంద పెట్టారని.. జోగులాంబ అమ్మను అవమానిస్తే తెలంగాణ మొత్తం అదే గతి పడుతుందని సంజయ్ హెచ్చరించారు. హిందూ సమాజానికి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.ప్రధానిపైనా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అత్యాచారాలు జరుగుతుంటే కనీసం పట్టుకోలేని కేసీఆర్.. తప్పు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చిన యోగి గురించి మాట్లాడతడా అంటూ ప్రశ్నించారు. వరదలతో తెలంగాణ అల్లాడిపోతుందని... కేసీఆర్ గతంలో చెప్పిన ఇస్తాంబుల్, లండన్, న్యూయార్క్ గురించి జనాలు ప్రశ్నిస్తారనే భయంతోనే వరదల విషయం నుంచి సమస్యను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు.
ప్రధాని మోడీ విదేశాలు తిరిగి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతుంటే.. కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకుంటున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కలలో కూడా ఏకనాథ్ షిండే కనిపిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని తెలిసు కాబట్టే కేసీఆర్ అంతగా భయపడుతున్నారని సంజయ్ చెప్పారు. ఎప్పుడు ఎవరూ ధిక్కరిస్తారో తెలియక టెన్షన్ పడుతూ చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియంత కేసీఆర్ నుంచి బయటపడి మంచి పార్టీలోకి పోవాలని టీఆర్ఎస్ లోని ఏక్ నాథ్ షిండేలు ఆలోచిస్తున్నరని తెలిసి కేసీఆర్ కు ఎక్కడలేని భయం పట్టుకుందన్నారు సంజయ్. ఇతర పార్టీలను ఎమ్మెల్యేలను లాక్కున్న కేసీఆర్ కు ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేయించిన అన్ని సర్వేల్లో కారు పార్టీకి ఓడిపోతుందని తేలిందని.. అందుకే కేసీఆర్ ఆగమాగం అవుతున్నారని సంజయ్ అన్నారు.
కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుపోతుంటే.. భారత్ ను ఆర్దికంగా పటిష్టంగా ఉంచిన ఘనత ప్రధాని మోడీదే అన్నారు బండి సంజయ్. గతంలో మోడీని పొగిడిన విషయం మర్చిపోయావా అని నిలదీశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా దేశం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశం గురించి మాట్లాడతవా? నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కాయిల్ తప్పి ఎందుకు మాట్లాడుతున్నవ్. సోడా కలిపిండ్రా లేదా? అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పదవీ విరమణ చేసిన జడ్జీలు సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే బీజేపీకి ఏం సంబంధం అని సంజయ్ అన్నారు. సుప్రీంకోర్టును గతంలో తిట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలను బండి సంజయ్ వినిపించారు.
Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook