1940ల్లో హైదరాబాద్ సంస్థానాన్ని ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న రోజుల్లో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సందర్భంలో ప్రజలు సాయుధపోరాటానికి సిద్ధపడ్డారు. అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో మహారాష్ట్రకు చెందిన మరాఠ్వాడ, కర్ణాటకకు చెందిన బీదర్ ప్రాంతాలు కూడా ఉండేవి. అంటే ఉన్న 16 జిల్లాలలో 8 జిల్లాలు తెలంగాణకు చెందినవి కాగా.. మరో ఎనిమిది జిల్లాలు మరాఠా, కన్నడ ప్రాంతానికి చెందినవి. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా.. నిజాం సంస్థానంలోని ప్రజలకు సంతోషంగా ఉండేది కాదు. నిరంకుశత్వం ఇంకా వారిని పట్టిపీడించేది. ఈ క్రమంలో జనాల నుండి వస్తున్న వ్యతిరేకతను కట్టడి చేయడానికి నిజాం.. తన ప్రైవేటు సైన్యమైన రజాకార్లను రంగంలోకి దింపారు. వీరు చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అమాయక స్త్రీలను చెరచి.. జనాల ఆస్తులను లూటీ చేసేవారు. ఈ దౌర్జాన్యాలకు అడ్డుకట్ట వేయడానికి ఎందరో తెలంగాణ వీరులు నడుం బిగించారు.
రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కవులు, కళాకారులు కూడా తమదైన శైలిలో ఉద్యమానికి చేయూతనిచ్చారు. 'గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడతాం.. కొడకా నైజాం సర్కరోడా' లాంటి గీతంలో యాదగిరి జనాలను చైతన్యం చేయగా.. 'ఈ భూమి నీదిరా.. ఈ నిజాం ఎవడురా' అంటూ సుద్దాల హనుమంతు అందుకున్న గళం కూడా జనాలను ఉద్యమం బాట పట్టించింది.
'నిజామనగ ఎంతరా.. వాడి తహతెంతరా.. అంతగలసి తంతెమల్ల వాడి అంతులేదురా' అని కాళోజీ రాసిన కవితలు సామాన్య జనాలను సైతం ఉద్యమబావుటాలు ఎగరవేసేలా చేశాయి. ఈ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలోనే వందేమాతరం రామచంద్రరావు జవహర్ లాల్ నెహ్రుకి నిజాం దుర్మార్గాల గురించి విశదీకరించి చెబుతూ ఓ లేఖ రాశారు. ఆఖరికి ఉద్యమం తీవ్రరూపం దాల్చాక.. భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. తమ సైనిక చర్యతో సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948 తేదిన ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకుంది. కానీ ఇదే సమయంలో నిజాం ఐక్యరాజ్యసమితికి భారత్ పై ఫిర్యాదు చేయడానికి దూతలను పంపడానికి సంసిద్ధమయ్యారు. కానీ ఫలితం లేకుండా పోయింది. నిజాంకు అండగా ఉన్న ఖాసిం రజ్వీ మొదలైన రజాకార్ల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ తెలంగాణ విమోచనోద్యమ కథ.