నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. మహారాష్ట్రతోపాటు శ్రీరాం సాగర్‌కు ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీరాం సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఇన్‌ఫ్లో మరింత పెరిగినట్టయితే, ఇంకొన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగుల వద్ద ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి లోకి నీరు విడుదల చేస్తోన్న క్రమంలో గోదావరి నదిలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీరాం సాగర్ జలాశయం నిండటంతో ఆ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇలా నిండటం ఎప్పుడూ చూడలేదని అక్కడి రైతులు చెబుతున్నారు.