తెలంగాణ తల్లి రూపంలో సోనియా విగ్రహాన్ని ప్రతిష్టించిన నేత.. కాంగ్రెస్‌కు గుడ్ బై

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కీలక నేతగా వ్యవహరించిన పి.శంకరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు.     

Last Updated : Nov 18, 2018, 07:00 PM IST
తెలంగాణ తల్లి రూపంలో సోనియా విగ్రహాన్ని ప్రతిష్టించిన నేత.. కాంగ్రెస్‌కు గుడ్ బై

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కీలక నేతగా వ్యవహరించిన పి.శంకరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో విధేయులకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ విఫలం అయ్యినందు వల్లే తాను పార్టీని వదలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకా ఉందంటే దానికి బలమైన పునాదులు వేసిన చెన్నారెడ్డి, వెంక‌ట‌స్వామి లాంటి వారే కారణమని.. వారి కుటుంబీకులను పార్టీ పట్టించుకోవడం లేదని శంకరరావు వాపోయారు.

తాజాగా ఆయన షాద్ నగర్ టికెట్ ఆశించినా.. అది ఆయనకు దక్కలేదు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. శంకరరావు సమాజ్ వాదీ పార్టీలో కూడా చేరుతున్నారని పలు వార్తలు వస్తున్నాయి. శంకరరావు  తొలుత 1983లో షాద్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989లో కూడా అక్కడి నుండే ఎన్నిక కాగా.. 1994లో మాత్రం తెలుగుదేశంకు చెందిన బి.నర్సిములు చేతిలో పరాజయం పొందారు.

1999లో మళ్ళీ షాద్ నగర్ నుంచి పోటీచేసి గెలిచారు శంకరరావు. 2004లో కూడా షాద్‌నగర్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసి బి.నర్సిములుపై విజయం సాధించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా  పనిచేసిన శంకరరావు... నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డివిజన్ జనరల్‌కు మారడంతో 2009లో సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్  తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి జి.శాయన్నపై 4 వేలకుపైగా ఓట్ల  మెజారిటీతో గెలుపొందారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలోనూ.. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ శంకరరావు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక.. తెలంగాణ తల్లి రూపంలో సోనియా విగ్రహాన్ని కూడా శంకరరావు కట్టించారు. 

Trending News