Revanth Reddy Speech From Adilabad Meeting : ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కొమురం భీం, రాంజీ గోండు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి బిడ్డలు పుట్టింది ఈ గడ్డ మీదే అని అన్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ సొంత రాష్ట్ర ఉద్యమం రాజేసిన " అయ్యోనివో.. నువ్వు అవ్వోనివో " అని గళమెత్తిన గూడ అంజయ్య కూడా ఈ గడ్డకు చెందినవాడే అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణను పట్టి పీడిస్తున్న కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కేసీఆర్ ను తెలంగాణ పొలిమేరలదాకా తరిమెందుకు వచ్చిన మీ స్ఫూర్తి అభినందనీయం. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబసభ్యులు, బంధువులకు పదవులు ఇచ్చుకుండు.. మరి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
చదువుకున్న దళిత, బీసీ బిడ్డలు, నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది అని అన్నారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దక 25 మంది విద్యార్థులు చనిపోయారు. భద్రంగా దాచాల్సిన ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. దీనికి కారణమైన కేసీర్ కుటుంబాన్ని బజారుకు ఈడ్చాలి. ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో పాటు టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించడంతో పాటు... గతంలో రాజయ్యను బర్తరఫ్ చేసినట్లే.. ప్రశ్నాపత్రాల కుంభకోణానికి కారణమైన మంత్రి కేటీఆర్‌ను కూడా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రతీ అభివృద్ధి పని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిందే. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎవరూ అధైర్య పడొద్దు. ఈ జోకుడు రామన్నలు ఆదిలాబాద్‌లో చేసేదేం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పదికి 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. రాష్ట్రంలో నూటికి 90 స్థానాలు తెచ్చుకునే బాధ్యతను మేం తీసుకుంటాం అని పేర్కొన్నారు.
బిజేపీ, బీఆర్ఎస్.. రెండూ ఒక్కటే..
బిజేపీ, బీఆర్ఎస్.. రెండూ ఒక్కటేనన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్‌ని అరెస్టు చేస్తే.. రాత్రి జైలుకు వెళ్లి ఉదయాన్నే బయటకు వచ్చారు. మా విద్యార్థి, యువజన నాయకులను అరెస్టు చేసి వారం రోజులు జైల్లో ఉంచారు. ఇది కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
ముస్లింలు ఏ వైపు ఉంటారో తేల్చుకోవాలి..
ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. 12శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్.. వాళ్లను మోసం చేశారు ఓట్లు దండుకున్నారు. మరొకరు అధికారంలోకి వస్తే ఉన్న 4 శాతం తీసేస్తామంటున్నారు అంటూ బీజేపికి చురకలంటించారు. రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ వైపు ఉంటారో.. లేక అసలు రిజర్వేషనే రద్దు చేస్తామన్న బీజేపీ వైపు ఉంటారో.. రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ వైపు ఉంటారో ముస్లిం సోదరులు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.