Revanth Reddy Singareni Job Fair: మరోమారు ఉద్యోగ ప్రకటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ఇచ్చారు. 15 రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మరోసారి చెప్పారు. వాటితోపాటు 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 ఉద్యోగాల ప్రకటన కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి సింగరేణిలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన వారిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 'పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటాం' అని చెప్పారు.
Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక
సింగరేణి సంస్థ సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి పాత్రను ఒకసారి గుర్తు చేశారు. 'తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరు. పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారు' అని గుర్తు చేసుకున్నారు. గత పాలకులు సింగరేణిని ఖాయిలా పడేలా చేశారని ఆరోపించారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి ఉందని చెప్పారు.
స్థానికులకే ఉద్యోగాలు
సింగరేణిలో ఉద్యోగాల విషయమై కీలక ప్రకటన చేశారు. స్థానికులకే సింగరేణి ఉద్యోగాలు దక్కాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటీవల ఆదేశించినట్లు సీఎం తెలిపారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook