హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు పస్తులుండి బాధపడుతోంటే.. సీఎం కేసీఆర్ వారిపై కనీస మానవత్వం చూపకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారం, అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయని కేసీఆర్.. 'నా ఇష్టం వచ్చినట్లు చేస్తా..చస్తే చావండి' అన్నచందంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి.. ఆర్టీసీని అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.
వేరే రాష్ట్రాల్లో ఇత పార్టీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్.. పక్కనే వున్న ఏపీని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. అయినవారికి ప్రజాధనాన్ని దోచిపెట్టాలని చూస్తోన్న కేసీఆర్ ఊచలు లెక్కపెట్టకతప్పదని హెచ్చరించారు.