హైదరాబాద్: తెలంగాణలో నేడు పోలింగ్‌కి సర్వం సిద్ధమైపోయింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 2.81 కోట్ల మంది ఓటర్లు నేడు తమ శాసన సభ అభ్యర్థిని తమ ఓటు హక్కు ద్వారా ఎంచుకోనున్నారు. పోలింగ్ కోసం రాష్ట్రంలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని, ఓటర్లు అందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో పోలింగ్‌కి సర్వం సిద్ధమైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రజత్ కుమార్.. ఒకవేళ ఎవరికైనా ఓటర్ ఐడీ కార్డులు అందకపోయినా.. వారి వద్ద వున్న ఓటర్ స్లిప్ (పోల్ చీటీ) చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ గుర్తింపు కార్డునైనా తీసుకువెళ్లి ఓటు వేయవచ్చని.. ఓటు వేసే సమయంలో ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్చగా ఓటు వేయాల్సిందిగా రజత్ కుమార్ సూచించారు.