Petlaburj Maternity Hospital | హైదరాబాద్: పేట్ల బురుజు మెటర్నటీ హాస్పిటల్‌లో 32 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది. కరోనావైరస్ సోకిన వారిలో 14 మంది డాక్టర్లు, 18 మంది ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు( Doctors tested positive). తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా ఒకే ఆస్పత్రిలో ఇంత మందికి కరోనావైరస్ సోకడం ఇదే తొలిసారి. కరోనావైరస్ వేగంగా వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఈ తరహా ఘటనలు ఢిల్లీలో పలుసార్లు వెలుగుచూసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అసలే ప్రసూతి ఆస్పత్రి కావడంతో వైద్య సిబ్బందికి కరోనా సోకడం కారణంగా వైద్య సేవలు నిలిచిపోకుండా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సోకిన వైద్యులు, ఇతర సిబ్బందిని ఇప్పటికే ఐసోలేట్ చేసి క్వారంటైన్‌కి (Quarantine) తరలించారు.
ప్రసూతి ఆస్పత్రి కావడంతో వైద్య సహాయం కోసం నిత్యం వందలాది మంది వస్తూపోతూ ఉంటారు. వీళ్లలో ఎవరి నుంచి ఆస్పత్రి సిబ్బందికి కరోనా సోకిందనే విషయం కనిపెట్టడం ఇప్పుడు అధికారులకు ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. అంతేకాకుండా వీళ్ల నుంచి మరెవరికైనా కరోనా సోకి ఉంటుందా అనే వివరాలు ఆరా తీయడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది.
పేట్లబురుజు ఆస్పత్రి కంటే ముందుగా ఉస్మానియా మెడికల్ కాలేజీతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రులలో, అలాగే గాంధీ ఆస్పత్రిలో పలువురు వైద్యులకు కరోనా సోకిన సందర్భాలు ఉన్నాయి.
ఇక ప్రజాప్రతినిధుల విషయానికొస్తే.. ఇదివరకే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకగా... తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా సోకినట్టు వైద్యులు గుర్తించారు.