Oldage Parents Protest: కూతురి ఇంటి ముందు వృద్ధ దంపతుల ధర్నా

Oldage Parents Protest: పెద్ద కుమారుడు వెంకటేశం చనిపోవడం, చిన్న కుమారుడు శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం నిజామబాద్‌లో ఉంటుండటంతో కూతురు అనిత, అల్లుడు శ్రీనివాస్ చారి ఆ వృద్ధ తల్లిదండ్రుల బరువు, బాధ్యతలు చూసుకుంటామని నమ్మపలికించి కొన్ని రోజుల పాటు వారిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.

Written by - Pavan | Last Updated : Dec 5, 2022, 04:53 AM IST
  • కూతురి ఇంటి ముందే వృద్ధ దంపతుల న్యాయ పోరాటం
  • న్యాయం చేయకపోతే ఇక్కడే ప్రాణం వదిలేస్తామంటున్న వృద్ధ తల్లిదండ్రులు
  • ఇద్దరు కొడుకులను కన్న ఆ తల్లిదండ్రులకు ఆ దుస్థితి ఎందుకొచ్చింది ?
  • కూతురి ఇంటి ముందే ఎందుకు టెంటే వేసి ధర్నాకు దిగారు.. పూర్తి వివరాలు చూద్దాం పదండి
Oldage Parents Protest: కూతురి ఇంటి ముందు వృద్ధ దంపతుల ధర్నా

Oldage Parents Protest: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం బండగల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తమ ఆస్తిని, బంగారాన్ని అంతా లాగేసుకున్న కూతురు, అల్లుడు తమను రోడ్డుపైకి గెంటేశారని బోరుమంటూ ఓ వృద్ధ దంపతులు కన్న కూతురి ఇంటి ముందే టెంట్ వేసుకుని ధర్నాకు దిగిన ఘటన ఇది. కన్న కూతురు అనిత ఇంటి ముందు టెంట్ వేసి వృద్ధ తల్లి తండ్రులు.. తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 

పిట్లం మండల కేంద్రానికి చెందిన వీరయ్య చారి, అంజవ్వ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు కాగా ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్ బతుకుదెరువు కోసం నిజామబాద్ వెళ్లి అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. కూతురు అనితకు 20 ఏళ్ల క్రితమే బాన్సువాడకు చెందిన తిర్మలపురం శ్రీనివాస చారికి ఇచ్చి వివాహం జరిపించారు. 

పెద్ద కుమారుడు వెంకటేశం చనిపోవడం, చిన్న కుమారుడు శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం నిజామబాద్‌లో ఉంటుండటంతో కూతురు అనిత వృద్ధ తల్లిదండ్రుల బరువు, బాధ్యతలు చూసుకుంటానని నమ్మపలికించి కొన్ని రోజుల పాటు వారిని తమ ఇంట్లోనే ఉంచుకుంది. అయితే, ఆ సమయంలోనే కూతురు అనిత, అల్లుడు శ్రీనివాస చారి తమకు మాయమాటలు చెప్పి తమ వద్ద నుంచి 15 తులాల బంగారం, 10 లక్షల నగదు తీసుకున్నారని.. తమ వద్ద ఏమీ లేకుండా అయ్యాకా తమను ఇంటి నుండి గెంటేసారని వృద్ధ దంపతులు బోరున విలపించారు. 

వృద్ధాప్యంలో తమ అవసరాల కోసం కష్టపడి దాచుకున్న ధనాన్ని కొట్టేసి తమను రోడ్డుపాలు చేశారని కూతురు అనిత, అల్లుడు శ్రీనివాస్ చారిలపై ఆరోపణలు చేశారు. తమ వద్ద ఉన్నదంతా తీసుకుని వయసుపైబడిన తమని ఇప్పుడు ఇలా రోడ్డుపైకి నెట్టేస్తే తమ ఆలనాపాలనా చూసుకునేది ఎవరని ఆ వృద్ధదంపతులు వాపోతున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వకుంటే కూతురి ఇంటి ముందే ప్రాణం వదులుతామని వృద్ధ దంపతులు తెగేసి చెబుతున్నారు. ఫ్లెక్సీపై కూతురు, అల్లుడు ఫోటోలు పెట్టి మరి '' తల్లిదండ్రులను, మేనత్తను మోసం చేసిన కూతురు.. సహకరించిన అల్లుడు '' అంటూ ఆందోళన చేపట్టారు. వృధ్దాప్యంలో వీరయ్య చారి, అంజవ్వ దంపతులు చేస్తోన్న న్యాయపోరాటం పలువురిని కంటతడి పెట్టించింది.

Trending News