Revanth Reddy: తెలంగాణ రాజకీయ భవిష్యత్ పరిణామాలకు కేంద్రంగా మారబోతోంది మునుగోడు ఉప ఎన్నిక. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప సమరం.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి పెద్ద తలనొప్పిగా మారింది. మునుగోడు కాంగ్రెస్ కు కంచకోట. 2018 ఎన్నికల్లో కేసీఆర్ వీచినా మునుగోడులో ఘన విజయం సాధించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచిన నియోజకవర్గం మునుగోడే. ఇప్పుడు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సింబల్ తో లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. తమకు పట్టున్న ప్రాంతంలో తేడా వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని పీసీసీ నేతలు బయపడుతున్నారు. మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో అనేక వివాదాలకు అడ్డాగా మారిపోయింది. పీసీసీ చీఫ్ కు టెన్షన్ పెట్టిస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ చండూర్ లో సభ పెట్టింది కాంగ్రెస్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైన ఆ సభలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. వెంకట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అద్దంకి కామెంట్లపై ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పుకునేవరకు పరిస్థితి వచ్చింది. మొదటి నుంచి దూకుడే రేవంత్ రెడ్డి అసలు స్వభావం. దాన్ని సైతం పక్కన పెట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షమాపణలు చెప్పడం ఒక ఎత్తైతే. ఇప్పుడా క్షమాపణలు స్వీకరించేదిలేదు అంటూ వెంకట్ రెడ్డి ప్రకటించడం, అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తుండటం రేవంత్ రెడ్డి కి మరింత తలనొప్పిగా మారింది. అటు అద్దంకి దయాకర్ ను వెనుకేసుకురాలేక చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్ష సంఘానికి సిఫారసు చేసి చేతులు దులుపుకున్నారు రేవంత్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నిక ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి టీంకు తాజా వ్యహారం మింగుడుపడటం లేదు. పార్టీ పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి సీనియర్ల రూపంలో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఒక ఎత్తైతే.... మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన, అసంతృప్తులను బుజ్జగించడం మరో సవాల్ కాబోతుందనే చర్చ నడుస్తుంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపుగా కృష్ణరెడ్డి పేరు ఫైనల్ అయినా అసంతృప్తులకు భయపడే ఇంకా ప్రకటించలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాల్వాయి స్రవంతి ఫోన్ కాల్ లీక్ కావడం, మిగితా ఆశావహులు కృష్ణారెడ్డి కి సహకరిస్తారా లేదా అనే భయం వెంటాడుతుంది. పార్టీ కార్యకర్తలతో అంతగా పరిచయంలేని కృష్ణారెడ్డికి టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమేనా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం కూడా రేవంత్ టీం ని కలవరపెడుతున్నాయి. రేవంత్ రెడ్డి కృష్ణారెడ్డి ని తీసుకోని వెళ్లిమరీ మాణిక్యం ఠాగూర్ తో చర్చలు జరిపారని, కృష్ణారెడ్డి కే సీట్ అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో మిగితా ఆశావహులు గుర్రుగా ఉన్నారు. దీన్ని రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా అతన్ని అడ్డంగా బుక్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం మూడు వేల ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్నే పదేపదే ప్రస్తావిస్తున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడులో రేవంత్ రెడ్డి ఎన్ని ఓట్లు తేస్తారో చూస్తానంటూ కామెంట్ చేస్తున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాని వెళ్లేది లేదని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా పట్టున్న వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు మైనసే. తమ్మడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక వెంకట్ రెడ్డి మునుగోడుతు రానని చెబుతున్నా.. రేవంత్ రెడ్డిని ఇరికింటే ప్లాన్ లో ఇది భాగమే అంటున్నారు. సిట్టింగ్ సీటులో గెలవకపోయినా.. కనీసం రెండో స్థానంలో నిలిచినా కాంగ్రెస్ పరువు నిలబడుతుంది. కాని మూడో స్థానానికి పడిపోతే మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గండమే. ఈ దిశగానే మునుగోడులో కాంగ్రెస్ సీనియర్లు రాజకీయం చేయబోతున్నారని తెలుస్తోంది. మునుగోడులో పార్టీకి తక్కువ ఓట్లు వస్తే.. దాన్ని అస్త్రంగా చేసుకుని రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి ఎసరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మునుగోడు గండం నుంచి ఎలా బయటపడుతారో.. ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించ బోతున్నారో చూడాలి మరీ..
Read Also: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి