Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 9న శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికలపైన ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు చెప్పారు.
హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు మంత్రి కేటీఆర్. ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని.. నగర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలకు ఆయన సూచించారు.
మెట్రో సెకెండ్ ఫేజ్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు చాలా ఉపయోకరంగా మారనుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సులభంగా నగరానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకరించపోయినా మెట్రో నిర్మించి తీరుతామని కేటీఆర్ చెబుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook