హైదరాబాద్ : గిరిజనుల కుంభమేళా, మేడారం మహా జాతర రెండవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. జాతరకు తరలివచ్చిన భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిలకల గుట్టను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లిని ఇవాళ సాయంత్రం గద్దె పైకి తీసుకురానున్నట్లు తెలిపారు. చిలకల గుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు మేడారం జాతరలో భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించారు.
జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడుతూ.. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు వంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఈసారి క్యూ లైన్లను పెంచామన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని.. అయినా కేంద్రం నుంచి సరియైన స్పందన లేదన్నారు. ఇకనైనా దీన్నిజాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు.
మేడారంలో భక్తులకు వసతులు, శాంతి భద్రతలపై, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జడ్పీ చైర్మన్ జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా, సీపీ రవీందర్, కలెక్టర్ కర్ణన్, ఇతర అధికారులు కలిసి మేడారంలో భక్తులకు వసతులు, శాంతి భద్రతలపై సమీక్ష జరిపారు.
మరోవైపు ఆదివాసీ మ్యూజియంను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సమ్మక్క - సారాలమ్మ వాడిన కత్తులు, వస్తువులు, నాటి దుస్తులు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..