TSPSC Group 4: పెళ్లయిన యువతి ఇంటి పేరు మారిందని గ్రూప్ 4 పరీక్ష హాలు వద్ద అడ్డుకున్న సిబ్బంది

Married Woman's Surname Change Issue: పెళ్లి అయిన యువతికి గ్రూప్ 4 పరీక్ష కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైన ఘటన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా అభ్యర్థి కుటుంబసభ్యులు, అధికారుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. చివరకి ఏమైందంటే...

Written by - Pavan | Last Updated : Jul 2, 2023, 11:07 AM IST
TSPSC Group 4: పెళ్లయిన యువతి ఇంటి పేరు మారిందని గ్రూప్ 4 పరీక్ష హాలు వద్ద అడ్డుకున్న సిబ్బంది

Married Woman's Surname Change Issue: పెళ్లి అయిన యువతికి గ్రూప్ 4 పరీక్ష కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైన ఘటన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్పీఎస్సీ ) జారీ చేసిన హాల్ టికెట్‌లో అభ్యర్థి ఇంటి పేరు ఒక తీరుగా, అభ్యర్థి తన ఐడెంటిటి కార్డు కోసం తీసుకొచ్చిన ఆధార్ కార్డులో మరో రకంగా ఉందన్న కారణంతో ఒక అభ్యర్థినిని అధికారులు పరీక్షా కేంద్రం ముందే నిలువరించారు. 

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను, వారి ఐడెంటిటి వివరాలతో సరిపోల్చుకుని చూసి, క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వారిని లోపలకు అనుమతించాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద డ్యూటీలు నిర్వహించే వారికి కొత్త కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నట్టున్నాయి. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఓ అభ్యర్థిని లోపలకు అనుమతించ లేదు. ఆ యువతి హాల్ టికెట్ లో ఉన్న ఇంటి పేరు, ఆధార్ కార్డుపై ఉన్న ఇంటి పేరు... రెండూ వేర్వేరుగా ఉండడంతో అవి మ్యాచ్ అవడం లేదు అని పరీక్షా కేంద్రం వద్ద డ్యూటీ చేస్తున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఆమెను లోపలకు అనుమతించలేదు.

అయితే, అధికారుల తీరుతో విసిగిపోయిన అభ్యర్థిని కుటుంబసభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. అమ్మాయికి పెళ్లి అయిన తరువాత ఇంటి పేరు మారుతుంది కదా.. కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అభ్యంతరం చెప్పడం ఏంటి అని అధికారులను నిలదీశారు. ఈ వివాదం కాస్తా అభ్యర్థి కుటుంబసభ్యులు, అధికారుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఈ విషయమై పరీక్షా కేంద్రం సూపరింటెండ్ కి ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యం అవడంతో.. జిల్లా కలెక్టర్ ను సంప్రదించి, తమ అనుమానాలు నివృత్తి చేసుకున్న తరువాత పరీక్షకు అనుమతిస్తామని అక్కడి అధికారులు చెప్పారు. 

పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించగా.. ఆ అభ్యర్థిని లోపలికి అనుమతించాల్సిందిగా అక్కడి నుంచి స్పష్టత లభించింది. అలా చివరకు జిల్లా కేంద్రం నుండి సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు రావడంతో పరీక్షా కేంద్రం వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు అభ్యర్థిని పరీక్షకు అనుమతించారు. ఈ ఘటన పరీక్షా కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ.. అభ్యర్థిని చివరకు పరీక్షకు అనుమతించడంతో ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగింది.

Trending News