KTR Chalo Medigadda: తెలంగాణకు జలప్రదాయినిగా.. జీవధారగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తిప్పికొట్టారు. మేడిగడ్డను పట్టుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నాలను కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మేడిగడ్డకు వెళ్లి అక్కడ నిరూపిస్తామని ప్రకటించారు. కాళేశ్వరం తెలంగాణకు జలధార.. జీవధారగా పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర పథకం కాళేశ్వరం అని వివరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. అనంతరం పార్టీ కార్యాచరణ ప్రకటించారు.
Also Read: Telangana: మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. మాపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ విమర్శలా?
'మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు, నాయకులు మేడిగడ్డకి వెళ్తాం. వారం రోజులు అక్కడే ఉండి కాళేశ్వరం అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు చూపిస్తాం' అని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం తెలంగాణ జలధార.. జీవధారగా పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర పథకం కాళేశ్వరం అని, మేడిగడ్డతో పాటు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు నుంచి కూడా నీళ్లు ఎత్తిపోసుకునే వెసులుబాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉందని వివరించారు. తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్, మహబూబాబాద్, కోదాడ వరకు కూడా కాళేశ్వరం నీళ్లు వెళ్తున్నాయని.. ఈ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసని చెప్పారు.
Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవ్వగానే జలయజ్ఞం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఎన్నో సంస్థలు తప్పుబట్టాయి. ఏపీ, మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయి. ప్రమాదాలు జరగడం సహజం. దురదృష్టవశాత్తు మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. వాటిని మరమ్మతులు చేస్తే సరిపోతుంది. అది కాకుండా శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట కాలయాపన చేస్తున్నారు. రాజకీయంగా మా మీద ఉన్న కక్షను రైతులపై చూపించొద్దు. ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలి' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
'ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సరైన ఆలోచన కాదని సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది. ఎంతో మంది నిపుణులు, వివిధ సంస్థలతో చర్చించి, నివేదికలు తీసుకున్న తర్వాతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు' అని కేటీఆర్ వివరించారు. మేడిగడ్డలో 84 పిల్లలు ఉంటే ౩ కుంగిపోయాయి. బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఫరక్కా బ్యారేజీ, కడెం ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయి. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయి. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చు. 2 నెలల్లో మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వచ్చు' అని వివరించారు. కానీ రేవంత్ రెడ్డి తీరు అలా లేదని అనుమానం వ్యక్తం చేశారు.
'సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తోంది. మేడిగడ్డను మరమ్మత్తు చేయకుండా మొత్తం కాళేశ్వరం కూలిపోవాలనే కుట్రపూరిత ఆలోచన చేస్తోంది. ఆ తర్వాత కేసీఆర్‌పై విమర్శలు చేయాలనే కుటిల బుద్ధి చేస్తున్నట్లు సమాచారం' అని రేవంత్ రెడ్డిపై విమర్శించారు. 'మార్చి 1వ తేదీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడుతుంది. 150 నుంచి 200 మంది పార్టీ ప్రతినిధులతో అక్కడకి వెళ్తున్నాం. తెలంగాణ భవన్ నుంచే ఈ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజు కాళేశ్వరం వెళ్తాం. అనంతరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టి వాస్తవాలు తెలుపుతాం' అని కేటీఆర్ షెడ్యూల్ విడుదల చేశారు. తమ వెంట వస్తామంటే సీఎం, మంత్రులు కూడా రావొచ్చని సలహా ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం..
- 3 బ్యారేజీలు
- 15 రిజర్వాయర్లు
- 19 సబ్ స్టేషన్‌లు
- 21 పంప్ హౌజులు
- 203 కిలోమీటర్ల సొరంగాలు
- 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్
- 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
- 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
- 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్
- 240 టిఎంసీల ఉపయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి