Komatireddy Opposes Revanth Reddy Nalgonda Tour: తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ టూర్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. నల్గొండ జిల్లాకు వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని... పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర ఆ సమావేశాలు పెట్టుకుంటే మంచిదని సూచించారు. అంతేకాదు, రేపు (ఏప్రిల్ 29) నల్గొండలో రేవంత్ సమీక్షా కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణలో రాహుల్ పర్యటనకు ముందు కాంగ్రెస్‌లో ఈ లుకలుకలు పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. రాబోయే మే 6న రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసే రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ నెల 27న నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులతో రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే నల్గొండలో రేవంత్ పర్యటనపై ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తుండటంతో రేవంత్ పర్యటన వాయిదా పడింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఈ నెల 29న రేవంత్ నల్గొండ పర్యటన ఖరారైంది. ఇలాంటి తరుణంలో... తాను రేవంత్ నిర్వహించే సమావేశానికి వెళ్లట్లేదని కోమటిరెడ్డి ప్రకటించడం పార్టీలో లుకలుకలను బయటపెట్టినట్లయింది.
ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత ఇక పార్టీలో విభేదాలు సమసిపోయినట్లేనని అంతా భావించారు. రాహుల్ సూచన మేరకు అంతా కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే విభేదాలు బహిర్గతమవడంతో కాంగ్రెస్ తీరు ఇక మారదేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.