Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: ఖమ్మం వేదికగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ భారీ ఆవిర్భావ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్కు అనుకూల వ్యాఖ్యలు చేసిన పినరయి విజయన్.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు అండగా ఉంటామని ప్రకటించారు. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయని వ్యాఖ్యానించిన పినరయి విజయన్.. కేంద్రం వైఖరితో దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందని అన్నారు. దేశంలో భారత రాజ్యాంగం సంక్షోభంలో పడింది. భావసారూప్యత కలిగిన పార్టీలతో బీఆర్ఎస్ పార్టీ కలిసి రావడం దేశానికే ఒక శుభపరిణామం. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు అండగా ఉంటూ వస్తోందని చెబుతూ కేసీఆర్ సర్కారును కొనియాడారు.
జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెబుతూ.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. ఖమ్మంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ పినరయి విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో యావత్ జాతికి ఈ సభ ఇక్కడి నుంచి దిశానిర్ధేశం చేయాల్సిన అవసరం ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు.
తెలంగాణ తరహా సంక్షేమ కార్యక్రమాలను కేరళలోనూ చేపట్టాం. పోరాటాలు చేసిన నేలగా తెలంగాణకు పేరుంది. అందుకే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరిగే పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తుచేస్తూ.. కేంద్రంపై పోరాటానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నడుం బిగించారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో చేపట్టిన ఆ పోరాటానికి మా మద్ధతు తప్పక ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక దేశం. ఫెడరల్ స్ఫూర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతిననివ్వకూడదు. కానీ గవర్నర్ వ్యవస్థను ఫెడరల్ స్పూర్తి కోసం కాకుండా రాజకీయంగా రాష్ట్రాలపై పెత్తనం కోసం వాడుకుంటున్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం అనైతిక విధానాలను అమలు చేస్తోందని పినరయి విజయన్ మండిపడ్డారు.
ప్రస్తుతం దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని కులం, మతం పేరుతో చీలుస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఖమ్మం సభ అందుకు దేశానికి దిక్సూచీ కావాలని అన్నారు. చర్చలు జరగకుండానే చట్ట సభల్లో బిల్లులు తీసుకొస్తున్నారు. న్యాయ వ్యవస్థను సైతం చిన్నాభిన్నం అయ్యేలా చేశారు. న్యాయవ్యవస్థలో కేంద్రం హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. ఉపరాష్ట్రపతి కూడా సుప్రీం కోర్టును కించపరిచేలా మాట్లాడారు. ఇది న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుంది. రాష్ట్రాలను కేంద్రం అసలు లెక్కలోకే తీసుకోకపోవడం ఫెడరల్ స్పూర్తికి విరుద్దం. కానీ మోదీ సర్కారు అదే పద్ధతిని అవలంభిస్తోంది అని పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని రాష్ట్రాల మాతృభాషలను, ప్రాంతీయ భాషలను చంపే ప్రయత్నంలో భాగంగానే హిందీని మనపై బలంగా రుద్దుతున్నారు. కార్పోరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోన్న ప్రధాని మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భరోసా ఇచ్చారు.