కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదన్నారు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసేలేదని అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించామని, దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని అన్నారు. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించినప్పటికీ కానీ కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు.