BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

BRS MLA Gampa Govardhan: కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీరు వివాదస్పదమైంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. దీంతో రైస్ మిల్లర్లు అంతా ఏకమై ఎమ్మెల్యే గంప గోవర్థన్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 04:47 AM IST
BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

BRS MLA Gampa Govardhan Controversy: రైస్ మిల్లు సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్థన్ బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని రైస్ మిల్లర్స్ డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం మొత్తం తడిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే రైతులు ఈ ధాన్యాన్ని బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని పూర్ణిమ రైస్ మిల్లులో దించేందుకు ప్రయత్నించారు. అయితే రైస్ మిల్లులో లోడింగ్, అన్‌లోడింగ్ సమస్య ఉందని చెబుతూ రైస్ మిల్లు యాజమాన్యం అందుకు నిరాకరించింది. 

ఈ విషయం కలెక్టర్ జితేశ్ పాటిల్ దృష్టికి చేరడంతో కలెక్టర్ రైస్ మిల్లర్లతో మాట్లాడారు. కచ్చితంగా ధాన్యం దించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ఒప్పుకున్నారు కానీ అందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. అయితే, ఈలోగానే తమ ధాన్యాన్ని పూర్ణిమ రైస్ మిల్లులో దించుకోనివ్వడం లేదని కొందరు రైతులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గంప గోవర్థన్ పూర్ణిమ రైస్ మిల్లు వద్దకు వెళ్లారు. ఎందుకు ధాన్యం దించుకోనివ్వరని మిల్లు సిబ్బందిని నిలదీశారు. అయితే వారు సమాధానం చెప్పిన తీరు ఎమ్మెల్యే గంప గోవర్ధనకు నచ్చలేదు. ఆగ్రహంతో రైస్ మిల్లు సిబ్బంది చెంప చెళ్లుమనిపించారు. 

దీంతో ఎమ్మెల్యే తీరుపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంపగోవర్ధన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ఇదిలావుంటే, కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని పూర్ణిమ రైస్ మిల్లులోకి వెళ్ళి అక్కడ పని చేసే గుమస్తా బాబుపై చేయి చేసుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌పై కామారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇంచార్జి రమణా రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... మొన్న రైతు భరోసా యాత్ర అనంతరం రైస్ మిల్లర్స్‌తో కలిసి కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కొనాలి అని చెప్పారని, కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొంటున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేసే లోపే నిన్న రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవడం భాదకారమని అన్నారు. 

రైస్ మిల్లర్లు అన్‌లోడింగ్, మిల్లింగ్ నిన్న రాత్రి నుండి బంద్ చేశారని అన్నారు. మిల్లర్లకు రైతులకు వారధిగా అధికారులు, రాజకీయ నాయకులు ఉండాలి కానీ అధికారుల సమక్షంలో అధికారులు చూస్తుండగా ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదనీ అన్నారు.  కావున ఎమ్మెల్యే బేషరతుగా రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని లేకుంటే బిజెపి పార్టీ ఆద్వర్యంలో ఆందోళన చెస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన ఒకసారి ఆలోచించి ఎమ్మెల్యే సత్వరమే క్షమాపణలు చెప్పి మిల్లింగ్ ప్రారంభించే ఏర్పాట్లు చేయాలనీ, రైస్ మిల్లర్లు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మిల్లింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రంలోపు రైస్ మిల్లులు ప్రారంభించాలని లేకపోతే రైతుల తరుపున ఉద్యమం చెస్తామని తెలిపారు.

Trending News