Telangana Intelligence Wing Lands In Soup: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం వైఫల్యం మరోసారి బయటపడింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తోన్న వీఆర్ఏలు.. ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి, అసెంబ్లీని ముట్టడించే వరకు ఆ విషయాన్ని తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం అధికారులు పసిగట్టకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. వారు ఛలో అసంబ్లీ పేరిట అసెంబ్లీని ముట్టడించే వరకు పసిగట్టకపోవడం అనేది కచ్చితంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గానే పరిగణించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది కూడా అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం ఇంకా మర్చిపోకముందే ఇలా దాదాపు 6 వేల సంఖ్యలో వీఆర్ఏలు ఒక్కచోట చేరుతుంటే తెలంగాణ ఇంటెలీజెన్స్ ఏం చేస్తున్నట్టు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు రోజుల ముందుగానే బంధువులు, స్నేహితుల ఇళ్లలోకి వీఆర్ఏలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి, తమ నిరసన గళం వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడినే సరైన వేదికగా భావించిన వీఆర్ఏలు.. తమ పథకం ఫెయిల్ కాకుండా ఉండేందుకు ఒక ప్లాన్ ప్రకారం పక్కా పథకం రూపొందించుకున్నారు. మంగళవారం నాడే హైదరాబాద్ కి వస్తే.. భారీ సంఖ్యలో వచ్చే తమని పోలీసులు హైవేలపైనే అడ్డుకునే ప్రమాదం ఉందని భావించిన వీఆర్ఏలు.. అందుకు భిన్నంగా ప్లాన్ వేశారు. ఛలో అసెంబ్లీ కంటే రెండు, మూడు రోజులు ముందుగానే హైదరాబాద్ తో పాటు నగరం శివార్లలోని తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు చేరుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా వారి ఇళ్లలోనే మకాం వేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా విడతల వారీగా దాదాపు 6 వేల మంది వీఆర్ఏలు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇవాళ అసెంబ్లీ వైపు వచ్చి అసెంబ్లీని ముట్టడించారు.
వీఆర్ఏలను అడ్డుకోలేకపోయిన పోలీసులు
ఊహించని విధంగా వేల సంఖ్యలో వీఆర్ఏలు అసెంబ్లీని ముట్టడించడంతో పోలీసులే షాక్ అయ్యారు. అనుకోని పరిణామంతో ఖంగుతిన్న పోలీసులు తేరుకునే లోపే ఆందోళన చేపట్టిన వీఆర్ఏలు మున్ముందుకు చొచ్చుకువచ్చారు. వేల సంఖ్యలో ఉన్న వీఆర్ఏలను కంట్రోలే చేయడం అక్కడున్న పోలీసు ఫోర్స్‌కి కత్తి మీద సాములా మారింది. చివరకు మంత్రి కేటీఆర్ కల్పించుకుని వీఆర్ఏ ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీతో వీఆర్ఏ ఉద్యోగ సంఘాల నేతలు కాస్త శాంతించి వెనక్కి తగ్గారు.
సాధారణంగానే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా ఇంటెలీజెన్స్ అధికారులు జాగ్రత్తలు వహిస్తుంటారు. రాష్ట్రంలో ఏవైనా డిమాండ్స్ పేరిట, ఏమైనా ఆందోళనలు జరుగుతున్నాయా ? అని పరిశీలించి ఆయా ఆందోళనలు చేపట్టే సంఘాలు, ప్రతినిధుల కదలికలపై ఓ కన్నేస్తుంటారు. ఒకవేళ ఆయా సంఘాల నుంచి అసెంబ్లీ సమావేశాలకు ఏమైనా నిరసన సెగలు తాకే ప్రమాదం ఉందంటే.. ఆ విషయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, సంబంధిత పోలీసు అధికారులకు చేరవేసి ఆందోళనలకు తావులేకుండా చూస్తారు. ఇంటెలీజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమయ్యే పోలీసులు.. హైదరాబాద్ కి దారితీసే అన్ని హైవేలపై నిఘా వేసి, ధర్నాలు చేయడం కోసం వచ్చే వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైనా సభలు, సమావేశాలు జరిగే ప్రతీసారి సర్వసాధారణంగా జరిగే తంతు ఇది. కానీ వీఆర్ఏల ఛలో అసెంబ్లీ ముట్టడి విషయంలో తెలంగాణ ఇంటెలీజెన్స్ అధికారులు ఈ పనిచేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్ అల్లర్లు, విధ్వంసాన్ని మర్చిపోయారా లేక వీఆర్ఏలను లైట్ తీసుకున్నారా ?
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆందోళన ఎంత హింసాత్మకమయ్యిందో అందరికీ తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువకుడి మృతితో పాటు ఎంతో ఆస్తినష్టానికి కారణమైన సికింద్రాబాద్ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన సికింద్రాబాద్ ఘటన తెలంగాణ ఇంటెలీజెన్స్ ఘోర వైఫల్యమేననే విమర్శలు మూటకట్టుకుంది. ఈ ఘటన జరిగి ఇంకా మూడు నెలలైనా గడవక ముందే ఇప్పుడిలా 6 వేల సంఖ్యలో వీఆర్ఏలు ఛలో అసెంబ్లీ నినాదంతో అసెంబ్లీని ముట్టడించడంలో విజయం సాధించడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పనితీరును మరోసారి వేలెత్తి చూపేందుకు అవకాశం ఇచ్చినట్టయ్యింది.
అదే కానీ జరిగి ఉంటే.. శాంతి భద్రతల పరిస్థితేంటి ? ఊహకందని నష్టం జరిగి ఉండేదా ?
సికింద్రాబాద్ అల్లర్ల విషయంలో ఆందోళనకారులంతా వాట్సాప్ మెసేజుల ద్వారా ఏకమైనట్టు దర్యాప్తులో తేలింది. ఆర్మీలో, కేంద్ర బలగాల్లో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్న ఓ కోచింగ్ అకాడమి ఈ అల్లర్ల వెనుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. పెట్రోల్ బాటిళ్లతో, టైర్లతో, రాడ్లు, కర్రలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రావాల్సిందిగా వాట్సాప్ ద్వారా ఆందోళనకారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. మరి 6 వేల మంది ఆందోళనకారులు ఒక్కచోట చేరినప్పుడు అందులో సంఘ విద్రోహ శక్తులు చేరి కలకలం సృష్టిస్తే అప్పుడు శాంతి భద్రతల పరిస్థితేంటి ? వేల సంఖ్యలో ఒక్కచోట పోగయ్యే ఆందోళనకారుల మధ్య అసాంఘీక శక్తులు ప్రవేశిస్తే.. శాంతియుతంగా చేపట్టాలనుకున్న ఆ ఆందోళన హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనుమానాలకు తావిస్తున్న ఇంటెలీజెన్స్, ప్రభుత్వ వైఖరి..
రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఇంటెలీజెన్స్ విభాగం వ్యవస్థ నిజంగానే వీఆర్ఏల ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పసిగట్టలేకపోయిందా ? ఒకవేళ ముందే పసిగట్టి ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరికలు జారీచేసినట్టయితే.. వీఆర్ఏల ఛలో అసెంబ్లీ నిరసనను ప్రభుత్వమే లైట్ తీసుకుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సంఖ్యాబలం పరంగా వీఆర్ఏల ఆందోళనలను లైట్ తీసుకున్నట్టే.. వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అంతే లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటెలీజెన్స్ వైఫల్యమే చెందిందో లేక ప్రభుత్వమే లైట్ తీసుకుందో.. కారణం ఏదైనా తహశీల్దార్ కార్యాలయం నుండి అసెంబ్లీ వరకు ప్రభుత్వానికి నిరసన సెగ తగిలించడంలో తాము సక్సెస్ అయ్యామని వీఆర్ఏలు (Etela Rajender supports VRAs) భావించడం కొసమెరుపు.
Also Read : TS Assembly Sessions 2022: తెలంగాణ అసెంబ్లీలో కేంద్రాన్ని ఏకిపారేసిన మంత్రి హరీశ్ రావు
Also Read : September 17th 2022: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెచ్చే మార్పులపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి