కేసు మిస్టరీని చేధించిన 'మటన్ సూప్'

హైదరాబాద్ హాస్పిటల్‌లో 'మటన్ సూప్', 27 ఏళ్ల మహిళను, తన ప్రియుడిని పోలీసులకు పట్టించింది. 

Last Updated : Dec 13, 2017, 05:20 PM IST
కేసు మిస్టరీని చేధించిన 'మటన్ సూప్'

ఒక కేసు మిస్టరీని పోలీసులు చేధించలేకపోయారు..అలాగే సీఐడీ కాదు కదా.. ఆఖరికి సీబీఐ కూడా చేధించలేకపోయింది. కానీ 'మటన్ సూప్' మాత్రం చేధించింది. నాగర్ కర్నూల్ బిల్డర్ సుధాకర్ రెడ్డి హత్య ఘటన గుర్తుందా..! ఆ కేసు గుట్టు రట్టుచేయడంలొో మటన్ సూప్ ప్రధానపాత్ర పోషించడం విశేషం. హైదరాబాద్ హాస్పిటల్‌లో 'మటన్ సూప్', 27 ఏళ్ల మహిళను, తన ప్రియుడిని పోలీసులకు పట్టించడం గమనార్హం.

స్వాతి అనే మహిళ తన భర్త సుధాకరరెడ్డిని పథకం ప్రకారం హత్య చేసి.. తన ప్రియుడి ముఖానికి  ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని ప్రయత్నించి.. భర్త స్థానంలోకి మార్చాలని అనుకుంది. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ పట్టణవాసి అయిన స్వాతి, సుధాకర్‌రెడ్డి  దంపతులు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ హత్య పూర్తిగా సినిమా ఫక్కీలో జరగడం గమనార్హం.

మీరు 'ఎవడు' సినిమా చూశారా..? అందులో హీరో అల్లు అర్జున్‌కు జయసుధ ప్లాస్టిక్  సర్జరీ చేస్తుంది. ఆ సీన్ గుర్తుందా..! సేమ్ టు సేమ్ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. స్వాతి ఆస్తి  కోసం భర్తను ప్రియుడు రాజేష్ సహాయంతో కలిసి చంపింది. స్వాతి మరియు ఆమె ప్రియుడు రాజేష్ అనే ఫిజియోథెరపిస్ట్ నవంబర్ 27 తేదీన ఈ హత్యకు కుట్ర పన్నారు. సుధాకర్ రెడ్డికి తొలుత మత్తుమందిచ్చి, ఆ తర్వాత హతమార్చి అడవుల్లో కాల్చేశారు.  తరువాత స్వాతి తన ప్రియుడి ముఖం మీద యాసిడ్‌ను పోసి ఇంటికి వెళ్లి.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన భర్త సుధాకర్ మీద యాసిడ్ పోశారని కుటుంబసభ్యుల ముందు వాపోయింది. 

స్వాతి భర్త సుధాకర్ రెడ్డిగా నటిస్తున్న రాజేష్‌ను చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. 10 రోజులపాటు బాగానే మేనేజ్ చేశారు. కానీ ఆసుపత్రిలో నర్సులు రాజేష్‌కు సేవించడానికి  'మటన్ సూప్' ను ఇచ్చిన సందర్భంలో, ఆయన తాను శాకాహారినని తెలపడంతో కంగు తినడం కుటుంబ సభ్యుల వంతైంది. ఆ సమయంలో హాస్పిటల్‌లోనే ఉన్న సుధాకర్ కుటుంబ సభ్యులకు అనుమానం కూడా వచ్చింది.  సుధాకర్  రెడ్డికి మాంసాహారం అంటే ఇష్టం.. కానీ ఎందుకు మటన్ సూప్ వద్దంటున్నాడు అనే సందేహం వారికి రావడంతో ఆలోచనలో పడ్డారు. అదీకాక గత కొద్ది రోజుల నుండి అతని ప్రవర్తనలో చాలా మార్పులను కూడా వారు గుర్తించారు. 

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. సుధాకర్ స్థానంలో రాజేష్ వేలిముద్రలను.. ఆధార్ వేలిముద్రలతో పోల్చి చూశారు. అంతే.. దొంగ దొరికాడు.. నిజం కూడా బయటపడింది. పోలీసులు ప్రశ్నించగా తన భర్తను ప్రియుడి సహాయంతో హతమార్చానని స్వాతి అంగీకరించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం రాజేష్‌ను  అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ హత్య కేసులో ఏ1 నిందితుడిగా రాజేష్‌ను, ఏ 2 నిందితురాలిగా స్వాతిగా పోలీసులు పేర్కొన్నారు.

Trending News