తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ షరతులు లోపభూయిష్టంగా ఉన్నాయని.. వెంటనే అందులోని అసమానతలను తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వివిధ విభాగాల్లోని 16,925 పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు 3 మార్కులు అదనంగా ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుబట్టాడు. ఈ నిబంధనతో లైసెన్స్ లేనివారు నష్టపోయే అవకాశం ఉందన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.
ఇది పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని.. హోంగార్డులకు వయోపరిమితి పెంపు ప్రభావం వల్ల కూడా రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం చేకూరుతుందని పిల్‌లో పేర్కొన్నారు. 'జిల్లాలు, కమ్యూనిటీల వారీగా రోస్టర్ విడుదలకాలేదు. కొన్ని విభాగాల్లో అభ్యర్థుల్ని పట్టించుకోలేదు. కనుక రిక్రూట్మెంట్ నిలిపివేయాలి’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.