హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇప్పటివరకు నివాసయోగ్య పత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) లేని నివాసాలకు సంబంధించిన నీటి బిల్లులపై వేస్తోన్న జరిమానా ఇక రద్దు కానుంది. జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు విభాగం అధికారల మధ్య సమన్వయ లోపంతో ఇంతకాలంపాటు హైదరాబాద్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనివారికి ఈ అదనపు బాదుడు తప్పలేదు. అయితే, ఎట్టకేలకు ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం ఏర్పడటంతో గత కొన్నాళ్లుగా సుమారు మూడు రెట్ల అదనపు బిల్లు చెల్లిస్తూ ఘొల్లుమంటున్న వినియోగదారులపై ఇకపై ఆర్థిక భారం తగ్గనుంది. శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యుడు విఠల్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఉన్నతాధికారులు స్పందిస్తూ ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారిక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఓసీ లేని వారికి ఇది ఓ శుభవార్తగా అధికారులు పేర్కొన్నారు. కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా లక్షలాది మంది నల్లా కనెక్షన్ వినియోగదారులకు లబ్ధి చేకూరనుండటంతోపాటు ఇంతకాలంపాటు ఓసీ లేని కారణంగా ఆటంకాలు ఎదుర్కున్న మిషన్ భగీరథ నల్లా కనెక్షన్‌లు సైతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
200 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆమోదించిన ప్లాన్ కన్నా అదనపు అంతస్తులు నిర్మించలేదని నిరూపించుకున్న వారికి ఓసీ లేకున్నప్పటికీ, వారి నీటి బిల్లుపై జరిమానాను మాఫీ చేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్ రెడ్డి తెలిపారు తెలిపారు.