తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గురువారం ఉదయం విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చారు. శాసన సభ, మండలి సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయన రాక ఒక్కసారిగా గుబులు లేపింది. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అవాక్కై ఆయన్ను గుమిగూడారు. త్వరలో జరగనున్న తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్సీలకు ఇచ్చేందుకు శాసన మండలికి వచ్చానని ఆయన మీడియాకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయన మండలి ప్రాంగణంలో కొద్దిసేపు తన శ్రేయోభిలాషులతో ముచ్చటించారు.
కేసీఆర్ తోనూ భేటీ
లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బుధవారమే భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి హాజరు కావలసిందిగా కోరారు. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్, లగడపాటి కలవడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. అప్పట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన లగడపాటి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ప్రయోగించి కలకలం సృష్టించారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.