హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాల అంశాన్ని తెరమీదకు తేవడం అమరావతిలో నిప్పు రాజేసింది. అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దని ఓవైపు టీడీపీ.. పరిస్థితి అదుపులోకి తీసుకరాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓ స్థిరాస్తి వ్యాపారికి లబ్ధి చేకూర్చేందుకే ఏపీలో గందరగోళ పరిస్థితులు తీసుకొచ్చారని ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతిలో పరిణామాలు చూస్తే తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉన్నప్పటికీ భారతీయుడిగా తనను బాధిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతికూల పరిస్థితుల కారణంగా హైదరాబాద్లో స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారం పెరిగిందన్నారు. కానీ నిన్నటివరకూ సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం తనను కలచివేస్తుందన్నారు. రాజధాని వివాదం త్వరలో ఓ కొలిక్కివస్తేనే ఏపీకి ప్రయోజనం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..