Holidays in Telangana Due to Heavy Rains : హైదరాబాద్‌లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం నలుమూలల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినా జనం రోడ్లపైనే ట్రాఫిక్ లో చిక్కుకుపోవాల్సి వస్తోంది. ఎటూ కదిలే పరిస్థితి లేకుండా గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (GHMC) పరిథిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం 2 రోజుల పాటు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సైతం రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా గుర్తించాలని సీఎం కేసీఆర్ సీఎం శాంతి కుమారికి స్పష్టంచేశారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
ఇదిలావుంటే, భారీ వర్షాల్లో యావత్ హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో భారీ వర్షాల మధ్య జనం భద్రతకు ముప్పు వాటిల్లకుండా ప్రైవేట్ సంస్థలు సైతం వారి వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని @TelanganaCS శ్రీమతి శాంతి కుమారిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైద్యం, పాల… pic.twitter.com/BTk9lXmWJV
— Telangana CMO (@TelanganaCMO) July 20, 2023
ఇది కూడా చదవండి : SI Gaddam Mallesh: భారీ వర్షాలు పడే సమయంలో పిల్లలు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నిరంతరం ఎక్కడికక్కడ తాజా పరిస్థితిని సమీక్షిస్తూ నగరవాసుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో, నాలాలు, మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ అక్కడ వరద నీరు నిలిచిపోకుండా ఉండేలా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి పనిచేస్తోంది. మొత్తానికి హైదరాబాద్‌లో భారీ వర్షాలతో నగరం జడి వానలో తడిసి ముద్దయింది. మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందా అనే ఆందోళన నగరవాసులను వెంటాడుతోంది.
ఇది కూడా చదవండి : Heavy Rains Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కడెక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK