టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే వారం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ఎన్నికల పర్యటనలో పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నవంబర్ 28, 29 తేదీల్లో చంద్రబాబు తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు స్పష్టంచేశాయి. డిసెంబర్ 7న తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమతి(టీజేఎస్) పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీతో కలిసి ప్రచారానికి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ శ్రేణులు స్పష్టంచేశాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ని ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు అందులో భాగంగానే ఈ నెల ఆరంభంలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.