Power Bills: కేటీఆర్‌ సంచలన ప్రకటన.. కరెంట్‌ బిల్లులు కట్టొద్దని తెలంగాణ ప్రజలకు పిలుపు

KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్‌' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్‌ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:26 PM IST
Power Bills: కేటీఆర్‌ సంచలన ప్రకటన.. కరెంట్‌ బిల్లులు కట్టొద్దని తెలంగాణ ప్రజలకు పిలుపు

Don't Pay Power Bills: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్‌ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న సమయంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వేదికగా జరిగిన సమావేశంలో కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. లండన్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత విద్యుత్‌ హామీ నిలబెట్టుకుంటారా లేదా అని నిలదీశారు. ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు జనవరి నెల కరెంట్‌ బిల్లులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఆ బిల్లులన్నింటిని సోనియా గాంధీకి పంపించాలని సూచించారు.

పార్లమెంట్‌ సెగ్మెంట్‌లపై నిర్వహిస్తున్న సన్నాహాక సమావేశాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్‌ నియోజకవర్గంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. లండన్‌లో రేవంత్‌ రెడ్డి చేసిన 100 మీటర్ల వ్యాఖ్యలపై మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి ఘాటు బదులిచ్చారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డిలాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని తాము చూశామని, మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలిగిన్రు అని గుర్తుచేశారు. రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్లను మట్టికరిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్... తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా?' అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని, రేవంత్ కాంగ్రెస్ ఏక్‌నాథ్‌ షిండేగా మారతాడని జోష్యం చెప్పారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండు అని ఎద్దేవా చేశారు. గతంలో అదానీపై అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని తెలిపారు. స్విట్జర్లాండ్‌లో అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండని పేర్కొన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై స్పందించిన కేటీఆర్‌ 'ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు' అని పిలుపునిచ్చారు. 'ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు' అని సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని కోరారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని చెప్పారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండు, కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10 జన్‌పథ్‌కు పంపించాలని కేటీఆర్‌ ప్రజలకు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్‌ చేశారు.

'గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2,500 వెంటనే ఇవ్వాలి. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఏరోజు పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ ఉండదని ప్రకటించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌కు ఐదేండ్లలో కిషన్‌ రెడ్డి ఏం చేసిండో చెప్పాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే.. కిషన్ రెడ్డి మాత్రం సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్‌లను జాతికి అకింతం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో 36 ఫ్లైఓవర్లు కడితే.. ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తేశారని కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే, తమ వల్లనే కాషాయ పార్టీ సీనియర్ నాయకులు పోటీకి వెనుకంజ వేశారని గుర్తుచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు. 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు, మహిళలకు ఇచ్చిన రూ.2,500 రావడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతామని కేటీఆర్‌ స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: Revanth Reddy London Tour: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. విఖ్యాత ప్యాలెస్‌లో ప్రసంగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News