KCR Protest Call: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండడంపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా రేవంత్ రెడ్డిలో చలనం లేకపోవడంతో కేసీఆర్ కన్నెర్ర చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలనే డిమాండ్‌తో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టాలని గులాబీ అధినేత పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: Revanth Reddy: రుణమాఫీపై కదలిక.. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం
రైతులను మరోసారి మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామని సీఎం ప్రకటన చేయడం రైతులను మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ మండిపడ్డారు.
Also Read: Kishan Reddy: రేవంత్ మాటలు విని నవ్వుకున్న ప్రజలు.. బీజేపీకే బ్రహ్మాండమైన ఫలితాలు
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. 'రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు (లావు) వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా ప్రకటిస్తుంది' అని ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగియగానే నాలిక తిరిగేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పాల్పడ్డారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ప్రకటన లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని, రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతులను అన్నిరకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని వివరించారు. రైతుల హక్కులు, హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపడుతుందని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు భరోసా కల్పించడంతోపాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
KCR Call To Protest: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ కన్నెర్ర.. ధర్నాలు చేపట్టాలని పిలుపు