111go revoke: 84 గ్రామాల్లో సంబరం.. కోటి మందిలో కలవరం!..111 జీవో ఎత్తేస్తే గండమేనా..?

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్  పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న 111 జీవోను ఎత్తివేసింది. 111 జీవో తొలగించడంతో ఆ 84 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే 111 జీవో ఎత్తివేతపై పర్యావరణ వేత్తలు, హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 08:03 AM IST

    111 జీవోను ఎత్తివేసిన తెలంగాణ సర్కార్
    111 జీవో ఎత్తివేతతో 84 గ్రామాల్లో సంబరం
    పెను ముప్పు తప్పదంటున్న పర్యావరణ వేత్తలు

 111go revoke: 84 గ్రామాల్లో సంబరం.. కోటి మందిలో కలవరం!..111 జీవో ఎత్తేస్తే గండమేనా..?

111GO REVOKE: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్  పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న 111 జీవోను ఎత్తివేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ కొత్త జీవో 69 జారీ చేశారు. గతంలో హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిర్మించారు. అయితే ఇకపై సిటీ వాసులు తాగు నీటి కోసం ఈ రిజర్వాయర్లపై అధారపడే పరిస్థితి లేదని, అందుకే 111 జీవోనూ తొలగిస్తున్నాయమని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టుల్లోని వాటర్ నీటి నాణ్యత ఏ విధంగానూ ప్రభావితం కావొద్దన్ కండీషన్స్ తోనే జీవోను ఎత్తివేస్తున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న జరిగిన సమావేశంలోనే 111 జీవో ఎత్తివేతకు  మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 12నే 111 జీవోను రద్దుచేస్తూ జీవో 69 జారీ చేసింది. అయితే ఈ విషయం ఏప్రిల్ 20న వెలుగులోనికి వచ్చింది.

నిజానికి జంట జలాశయాల పరిధిలో ఉన్న 111 జీవోను ఎత్తివేయాలని.. దాని పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా హామీలు ఇస్తూ వచ్చాయి కాని అమలు చేయలేదు. తాజాగా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేసింది. 111 జీవో తొలగించడంతో ఆ 84 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే 111 జీవో ఎత్తివేతపై పర్యావరణ వేత్తలు, హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయాల పరిధిలో అడ్డగోలు నిర్మాణాలు చేస్తే భవిష్యత్ లో నగరానికి పెను ముప్పు రావొచ్చని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కోటి మంది ప్రాణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాదంలో పెట్టిందని కలవర పడుతున్నారు. 

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల్లోని నీటి నాణ్యతను కాపాడటంతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాను పరిరక్షించేందుకు 1996 మార్చి 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చింది. జలశాయల ఫుల్ ట్యాంక్ లెవల్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో గల 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల్లో నిర్మాణాలను నిషేధించింది. కాలుష్య కారక కంపెనీలు, బడా హోటళ్లు, రెసిడెన్షియల్ కాలనీలు చేపట్టవద్దని 111జీవోలో(111GO) ఆంక్షలు పెట్టింది అప్పటి సర్కార్. భాగ్యనగర వాసుల నీటి అవసరాలు పెరగడం, భవిష్యత్ అవసరాల కోసమే జీవో తీసుకొచ్చామని తెలిపింది. 

అయితే ఇప్పుడు జీవో111ను ఎత్తివేయడంతో జంట జలాశయాల పరిధిలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో వరదలకు అవకాశం ఉంటుందంటున్నారు. హైదరాబాద్ నీటి అవసరాలకు ప్రభుత్వం చెబుతున్న గోదావరి, కృష్టా జలాలు సరిపోకపోవచ్చని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ మాత్రం జంట జలాశయాల పరిరిక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామంటోంది. కలుషిత నీరు జలాశయాల్లో కలవకుండా  డైవర్షన్ చానళ్లను నిర్మిస్తామని ప్రకటించింది.

Trending News