BRS Party MLAs: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు.. మొన్నటి దాకా బీఆర్‌ఎస్ పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్న కె.కేశవ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన వెంటనే అనూహ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన చేసిన ఈ ఒక్క పని ఆరుగురి ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. పార్టీ ఫిరాయింపుల కింద రాజీనామా చేయడంతో ఇటీవల పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలింది. కేకే రాజీనామాతో వాళ్లు కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తోంది.
Also Read: KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్
బీఆర్‌ఎస్ పార్టీలో మాజీ సీఎం కేసీఆర్ తర్వాత అంతటి గుర్తింపు పొందిన వ్యక్తి కె.కేశవరావు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో దిల్లీలో కేకే కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఆ తెల్లవారే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున వచ్చిన ఎంపీ పదవిని త్యజించారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రమాదంలో నెట్టేసింది.
Also Read: Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన తెల్లం బాలరాజు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇతర పార్టీ నుంచి గెలిచిన వారు ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తూ రాజీనామాలు లేకుండానే పార్టీ ఫిరాయిస్తున్నారు. పార్టీ మారిన వారు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ చేస్తున్న డిమాండ్‌కు కేకే రాజీనామా బలం చేకూరింది. పార్టీ మారిన కేకే రాజీనామా చేసినట్టుగానే 6 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఫిరాయింపులపై ఆ పార్టీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. త్వరలోనే దీనిపై ధర్మాసనం తీర్పునిచ్చే అవకాశం ఉంది. కేకే ఎంపీ పదవికి రాజీనామాతో ఎమ్మెల్యేల రాజీనామాకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది.
ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పరిస్థితి గడ్డుగా తయారవుతోంది. మంత్రి పదవుల్లో అవకాశం లేదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది. నియోజకవర్గాల్లో ఫిరాయింపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ మారిన తర్వాత గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు కేకే రాజీనామా వ్యవహారంతో తమ ఎమ్మెల్యే పదవులకే ఎసరు వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలోనని ఆరుగురు ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
BRS Party MLAs: ఎంపీ కె కేశవరావు రాజీనామాతో 6 మంది ఎమ్మెల్యేలకు పదవీ గండం?