Chandrababu Naidu Case Latest News Updates: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీ, ఇప్పుడు ఆయన సీఐడీకి రెండు రోజుల రిమాండ్... మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం.. అందరూ చూస్తున్నారు. నిన్నటి శుక్రవారం చంద్రబాబు వర్చువల్ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారు. తాను నీతిమంతుడ్ని అని చెప్పుకొచ్చారు. దాన్ని ఎల్లో మీడియా బాగా హైలైట్ చేసింది. అదే సమయంలో మా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోషం, చంద్రబాబుపై ప్రేమను చూపాయి. ప్రజా జీవితంలో ఉన్న వారు, పరిపాలన చేసే వాళ్లు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా అవినీతికి పాల్పడవద్దు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో ఆయన వాటన్నింటినీ అతిక్రమించారు. కానీ ఎప్పుడూ దొరకలేదు. ఇప్పుడు దొరికి దొంగ అయ్యారు. దీంతో ఆయన బేలగా మాట్లాడుతున్నారు అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
వీటికి సమాధానం చెప్పగలరా ?:
ఒక్క విషయం అడుగుతున్నాం. మీరు ఆరోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో.. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? మన ప్రభుత్వం వాటా రూ. 371 కోట్లు ఇచ్చారు. కానీ సీమెన్స్ కంపెనీ తన వాటాగా ఇవ్వాల్సిన దాదాపు రూ. 3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మరి అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసింది? దీనిపై చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ అస్సలు ఎందుకు మాట్లాడడం లేదు అని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
మరి ఒప్పందం చేసుకున్న డిజైన్ టెక్ కంపెనీ ఏ పద్ధతిలో ఎంపిక చేసుకున్నారు? ఏ విధానంలో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అవన్నీ అక్రమం అని చంద్రబాబుకు తెలియదా? అంటే తెలిసే ఆయన ఆ అక్రమానికి తెర లేపారు అని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు.
సీమెన్స్ పెట్టుబడి ఎందుకు రాలేదు ?
మేము సీమెన్స్ కంపెనీ మంచిది కాదని చెప్పడం లేదు. ఆ కంపెనీని తప్పు పట్టడం లేదు. కానీ మీరు ఆ కంపెనీతో ముందు చేసుకున్న ఒప్పందం ఏమైంది? ఆ కంపెనీ ఎందుకు పెట్టుబడి పెట్టలేదని మాత్రమే అడుగుతున్నాం? సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేసింది. కానీ అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇచ్చారు. పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ సీమెన్స్ కంపెనీ ఏ పనీ చేయలేదు. వారు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేదు.
పోచారం వ్యాఖ్యలు ఖండిస్తున్నాం:
నిన్న తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్పందించారు. కారణం చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన అనుకుంటే, ఆ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడాలి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ స్పీకర్ పోచారంకు హితవు పలికారు.
చంద్రబాబును అడగండి:
మా ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా, చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఎక్కడ, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. ఈరోజు ఎల్లో మీడియా పేజీలకొద్తీ రాశాయి. వారినే అడుగుతున్నాను. వెళ్లి చంద్రబాబును అడగమనండి. ఏమయ్యా, సీమెన్స్ కంపెనీ ఒప్పందం ప్రకారం పెట్టుబడి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఏ కార్యకలాపాలు నిర్వహించలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేసిందని.. చంద్రబాబును అడగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజాధనాన్ని కాపాడాలి. అంతేకానీ, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు అని మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు హితవు పలికారు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అంత పెట్టుబడి అవసరమా?:
మేము సీమెన్స్ కంపెనీని ఏం అనడం లేదు. తమకు ఆ ఒప్పందంతో సంబంధం లేదని స్వయంగా సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఆ మెయిల్ లేఖ కూడా మేము చూపాం. మీరు అడుగుతున్నారు కదా.. సీమెన్స్ కంపెనీ తమ పెట్టుబడి పెట్టకుండా, ఆ మొత్తం రూ. 2900 కోట్లకు సాఫ్ట్‌వేర్ ఇచ్చారా ? అసలు మన దగ్గర సెంటర్లు ఎక్కడున్నాయి? ఒక్కో సెంటర్‌కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నిజంగా వాటికి అంత పెట్టుబడి అవసరమా? అసలు వాటికి సీమెన్స్ కంపెనీ, సాఫ్ట్‌వేర్ ఏమైనా ఇచ్చిందా? అవన్నీ చూద్దాం. సీమెన్స్ కంపెనీ కేవలం రూ. 55 కోట్ల సాఫ్ట్‌వేర్ మాత్రమే ఇచ్చింది. ఆ మొత్తం తమకు వచ్చిందిన సీమెన్స్ కంపెనీ కూడా చెప్పింది.
వారు క్లియర్‌గా రాశారు:
ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉంటే.. వారు బాధ్యులై ఉంటే, చర్యలు ఉంటాయి. ఈ క్షణం వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో.. వారికి ప్రమేయం ఉందని తెలిస్తే.. చర్యలు తీసుకుంటాం. కానీ, ఆరోజు అధికారులు చాలా స్పష్టంగా రాశారు. నిధులు విడుదల చేయొద్దని రాశారు. అయినా అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిధులు విడుదల చేశారు. అదే విషయాన్ని వారు స్వయంగా నోట్‌లో రాశారు అంటూ సీమెన్స్ కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య జరిగిన లావాదేవీలపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు సమాచారం అందించారు.