ఇటీవల కాలంలో చాలా కాలం తర్వాత క్రికెట్ ప్రియులను మరోసారి ఉత్కంఠకు గురిచేసింది వైజాగ్‌లోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా అనంతరం 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయడంతో చివరగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలోనే మ్యాచ్ చివరలో ఫలితం ఎలా ఉంటనుంది ? ఎవరిని విజయం వరించనుందనే ఉత్కంఠ క్రికెట్ ప్రియులను వెంటాడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌తో వన్డేల్లో 37వ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలి, రికీ పాంటింగ్ వంటి క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న 10,000 పరుగుల రికార్డుని(వన్డేల్లో) కోహ్లీ బ్రేక్ చేశాడు.
టీమిండియా బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (4), శిఖర్ ధావన్ (29) విఫలమైనా.. కెప్టేన్ విరాట్ కోహ్లి, అంబటి రాయుడు జట్టు స్కోర్‌ను పరుగులెత్తించడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 139 పరుగులు జోడించిన అనంతరం అంబటి రాయుడు 80 బంతుల్లో 73 పరుగులు (4X8) చేసి ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే, వైజాగ్ వన్డేలో కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. సెంచరీ పూర్తయిన తర్వాత నాలుగు సిక్స్‌లు బాది స్కోర్‌లో వేగాన్ని పెంచాడు. చివరికి 129 బంతుల్లో 157 పరుగులు (4X13, 6X4) చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డే మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ నాలుగోసారి 150 మైలు రాయిని చేరుకున్నాడు.