విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం గతేడాది డిసెంబర్ లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే..! వివాహం అనంతరం ‘హనీమూన్’ను స్విట్జర్లాండ్‌లో జరుపుకుంది విరుష్క జోడీ. ప్రస్తుతం ఈ జోడీకి అపూర్వ ఆహ్వానం అందింది. స్వయంగా శ్రీలంక క్రీడాశాఖ మంత్రే విరుష్క జోడీని ఆహ్వానించడం విశేషం. విరాట్ కొహ్లీ దంపతులు హాలిడేలను శ్రీలంకలో గడపాలని కోరారు.
ఆటలోని లోటును విహారంతో భర్తీ చేయాలని.. తమ దేశ అతిథిగా తమ ద్వీపంలో గడపాలని శ్రీలంక దేశమంత్రి దయసిరి జయశేఖర ఆహ్వానం పలికారు. ‘కోహ్లిని ఆడేందుకు పిలవట్లేదు. వివాహం తర్వాత ఇక్కడ పర్యటించని కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విహరించాలని ఆహ్వానిస్తున్నా. లంక ద్వీపంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిని చూస్తూ సేదతీరవచ్చు’ అని జయశేఖర పేర్కొనట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. తాను కోహ్లీకి అభిమానినని చెప్పిన మంత్రి.. గత ఏడాది శ్రీలంక పర్యటన సందర్భంగా కొలంబోలో జరిగిన రెండో టెస్టు గురించి ప్రస్తావించారు.
ప్రస్తుతం విరుష్క జంట ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో కాపురం పెట్టింది. దీని అద్దె నెలకు రూ.15 లక్షలు. 24నెలలు ఇంట్లో ఉండేందుకు అగ్రిమెంట్ చేసుకొని రూ. కోటి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అయితే వర్లీ ప్రాంతంలో ఇప్పటికే కోహ్లీ ఓ ఫ్లాట్‌ను రూ.34 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో తాత్కాలికంగా అద్దె ఇంట్లో ఉంటోంది ఈ జంట.