ఎయిర్ పోర్టులోనే పెళ్లి నిశ్చితార్థ వేడుకలు చేసుకున్న.. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత

ఇండోనేషియాలో జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇటీవలే భారత రెజ్లర్ వినేష్ పోగట్ స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

Last Updated : Aug 28, 2018, 10:53 PM IST
ఎయిర్ పోర్టులోనే పెళ్లి నిశ్చితార్థ వేడుకలు చేసుకున్న.. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత

ఇండోనేషియాలో జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇటీవలే భారత రెజ్లర్ వినేష్ పోగట్ స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగంలో పోటీపడిన వినేష్ బంగారు పతకాన్ని పొంది చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత భారత్ తిరిగొచ్చిన ఆమెకు ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. చిత్రమేంటంటే అదే ఎయిర్ పోర్టులో వినేష్ పోగట్ కోసం నిశ్చితార్థ వేడుకలు జరిపారు ఆమె తల్లిదండ్రులు. అనుకోని ఆ పరిణామానికి వినేష్ ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకొని ఆనందంగా తన బాయ్ ఫ్రెండ్ మరియు మాజీ రెజ్లర్ సోమవీర్ రాతితో ఆమె ఉంగరాలు మార్చుకొని పెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు.

ఆ నిశ్చితార్థ కార్యక్రమంలో సోమవీర్ తల్లితో పాటు వినేష్ మామయ్య మహావీర్ సింగ్ పోగట్ కూడా పాల్గొన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వినేష్‌కు నిశ్చితార్థం జరిగిన రోజునే ఆమె పుట్టినరోజు కూడా. వినేష్ తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తె పుట్టినరోజు నాడు తనకు మరిచిపోలేని కానుక ఇవ్వాలని భావించానని.. అందుకే ఆమెకు తెలియకుండా నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేశామని తెలిపారామె. 

ఆసియా క్రీడల్లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ పోగట్, జపాన్ ప్రత్యర్థిపై 6-2 తేడాతో గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీస్‌లో కూడా ఉజ్బెకిస్తాన్‌కి చెందిన దౌలత్ బైక్ యక్షిమురతోవాతో కూడా వినేష్ పోగట్‌కి ఆసక్తికరమైన పోరే జరిగింది. ప్రత్యర్థిని కేవలం 75 సెకన్లలోనే 10-0 స్కోరుతో ఓడించిన వినేష్.. క్వార్టర్స్‌లో కూడా దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యెంగ్‌జూని 11-0 తేడాతో ఓడించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలుపొందిన వినేష్ పోగట్.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌‌లో 50 కేజీల విభాగంలో కూడా స్వర్ణం గెలుచుకున్నారు. తాజాగా ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారామె.

 

Trending News