ఉమేష్ యాదవ్ దెబ్బకి వెస్టిండీస్ విలవిల.. భారత్ ఖాతాలో అద్భుత విజయం

వెస్టిండీస్‌తో ఆడిన రెండవ మ్యాచ్‌లోనూ భారత క్రికెట్ జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. 

Last Updated : Oct 14, 2018, 07:11 PM IST
ఉమేష్ యాదవ్ దెబ్బకి వెస్టిండీస్ విలవిల.. భారత్ ఖాతాలో అద్భుత విజయం

వెస్టిండీస్‌తో ఆడిన రెండవ మ్యాచ్‌లోనూ భారత క్రికెట్ జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. రెండవ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 71 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు 16.1 ఓవర్లలోనే చేరుకున్నారు. పృథ్వీ షా(33 పరుగులు), కేఎల్‌ రాహుల్‌(33 పరుగులు) ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో సిరీస్ 2-0తో టీమిండియా వశమైంది. అంతకు ముందే భారత బౌలర్లు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లకు చుక్కలు చూపించారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడినా.. రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత బౌలర్లు రెచ్చిపోయి ఆడారు. బ్యాటింగ్‌కి దిగిన వెంటనే ఇద్దరిని డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపారు.

ఉమేశ్‌ యాదవ్‌ ధాటికి వెస్టిండీస్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. కేవలం 54 పరుగులకే టాప్ ఆర్డర్ కోల్పోయిన వెస్టిండీస్.. తమ కెప్టెన్‌ హోల్డర్‌(19 పరుగులు) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి చేతులెత్తేయడంతో మరిన్ని కష్టాల్లో పడింది. సునిల్‌ ఆంబ్రిస్‌(38; 95 బంతుల్లో) కాస్త పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించినా.. జడేజా ఎల్బీగా తనను వెనక్కి పంపించాడు.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 311 పరుగులకే పరిమితమైంది. రాస్టన్ చేజ్ 106 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. జాసన్ హోల్డర్ అర్థ సెంచరీ (52 పరుగులు) చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కూడా ఉమేష్ యాదవ్ 6 వికెట్లు తీసుకున్నాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (70 పరుగులు), రహానే (80 పరుగులు), రిషబ్ పంత్ (92 పరుగులు) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయడంతో టీమిండియా 367 పరుగులు చేయగలిగింది. దీని ప్రతిగా రెండవ ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్ జట్టు అనుకున్న మేరకు ఆడలేకపోయి చతికిలబడిపోయింది. కేవలం 46 ఓవర్లలోనే 127 పరుగులకు ఆలౌట్ అయ్యి.. భారత్ ముందు కేవలం 71 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్‌మన్లు ఆడుతూ పాడుతూ.. 16.1 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు.

Trending News