యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. సత్తా చాటిన మను బకర్

భారత యువ సంచలనం మను బకర్ మంగళవారం జరిగిన యూత్ ఒలింపిక్స్ పోటీలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించి సత్తా చాటింది.

Last Updated : Oct 10, 2018, 01:26 PM IST
యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. సత్తా చాటిన మను బకర్

భారత యువ సంచలనం మను బకర్ మంగళవారం జరిగిన యూత్ ఒలింపిక్స్ పోటీలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించి సత్తా చాటింది. 16 ఏళ్ల బకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో 236.5 పాయింట్లు సాధించి తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా.. 235.9 పాయింట్లతో రష్యాకి చెందిన లానా ఎనినా రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గతంలో వరల్డ్ కప్‌తో పాటు కామన్వెల్త్ క్రీడలలో కూడా స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్న మను బకర్ 2018 ఆసియా క్రీడల్లో కూడా పాల్గొంది. కానీ పతకాన్ని గెలవలేకపోయింది.

2017లో జరిగిన జాతీయ క్రీడల్లో మను బకర్... హీనా సిద్ధూ లాంటి టాప్ షూటర్‌ని సైతం మట్టికరిపించి విజయాలు నమోదు చేయడం విశేషం. ఆ విజయాలతోనే ఆమె వార్తలలో కూడా నిలిచింది. చిన్నప్పటి నుండీ క్రీడలంటే ఎంతో ఆసక్తి కలిగిన మను బకర్.. బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ లాంటి పోటీల్లో కూడా సత్తా చాటింది. 14 సంవత్సరాల వయసులోనే హ్యుయన్ లాంగ్లాన్ అనే మణిపూరి మార్షల్ ఆర్ట్స్ ప్రక్రియలో కూడా నిష్ణాతురాలైంది.

హర్యానాలోని జజ్జర్ జిల్లాలో 18 ఫిబ్రవరి 2002 తేదిన జన్మించిన మను బకర్.. 2018లో అతి పిన్న వయసులోనే ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రపంచ కప్‌లో పతకం కైవసం చేసుకున్న మహిళగా కూడా వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ తరఫున పతక ధారణ చేస్తూ.. టీమ్‌ను నడిపించిన ఘనత కూడా మనుకే దక్కడం విశేషం. 

Trending News