పంజాబ్ కింగ్స్‌పై గెలిచి లెక్క సరిచేసిన రాజస్థాన్‌ రాయల్స్

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపు

Last Updated : May 9, 2018, 12:23 AM IST
పంజాబ్ కింగ్స్‌పై గెలిచి లెక్క సరిచేసిన రాజస్థాన్‌ రాయల్స్

జైపూర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన 40వ ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ జట్టు చేతిలో ఇండోర్‌లో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్ ఈ విజయంతో లెక్క లెవల్ చేసుకుంది. పంజాబ్ జట్టు తరుపున కేఎల్‌ రాహుల్‌ చేసిన 95 పరుగులు నాటౌట్ (70 బంతుల్లో 11×4, 2×6) ఈ ఓటమితో వృథా అయ్యాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోస్ బట్లర్ 82 పరుగులు (58 బంతుల్లో 9X4, 1X6), సంజూ శాంసన్ 22 పరుగులు (18 బంతుల్లో 1X4, 1X6) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కెప్టేన్ అజింక్య రహానే సైతం 9 పరుగులకే పెవిలియన్ బాటపట్టగా బెన్ స్టోక్స్ 14 పరుగులకే ఆండ్రూ విసిరిన బంతిని హిట్ ఇవ్వబోయి రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులే చేసింది. 

అనంతరం 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమై ఓటమిపాలైంది. పంజాబ్ ఓటమితో ఆ జట్టు తరుపున ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్ కృషి వృధా అయినప్పటికీ.. పంజాబ్ ఆటగాళ్లను కట్టిడి చేయడంలో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ బౌలర్ల సమిష్టి కృషి ఫలించింది.

Trending News