ఫైనల్లో భారత్‌తో తలపడనున్న బంగ్లాదేశ్‌

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న నిదహాస్‌ ట్రోఫీ ముక్కోణపు టీ-20 సిరీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.

Last Updated : Mar 17, 2018, 12:44 PM IST
ఫైనల్లో భారత్‌తో తలపడనున్న బంగ్లాదేశ్‌

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న నిదహాస్‌ ట్రోఫీ ముక్కోణపు టీ-20 సిరీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. కాగా, టీ-20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక క్రికెట్‌ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే భారత్‌ ఫైనల్‌‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఈ నెల 18వ తేదీన జరగనున్న ఫైనల్లో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి.

శుక్రవారం జరిగిన కీలక టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. మహ్మదుల్లా మెరుపులతో బంగ్లా మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ఫైనల్‌కు చేరుకుంది.

శ్రీలంక జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఎడిజికే పెరీరా 40 బంతుల్లో ఒక సిక్సర్, 7 ఫోర్లతో 61, కెప్టెన్ తిషారా పెరీరా 37 బంతుల్లో 58 పరుగులతో అర్థ సెంచరీలు పూర్తి  చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన తమీమ్ ఇక్బాల్ 42 బంతుల్లో రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు, మహ్మదుల్లా కేవలం 18 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

Trending News