లంకపై కివీస్ మెరుపు దాడి; 10 వికెట్ల తేడాతో ఘన విజయం

ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే న్యూజీలాండ్ జట్టుకు శుభారంభం లభించింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌‌లో కివీస్ ఆటగాళ్లు లంక జట్టుతో ఆడుకున్నారనే చెప్పొచ్చు.

Last Updated : Jun 1, 2019, 08:50 PM IST
లంకపై కివీస్ మెరుపు దాడి; 10 వికెట్ల తేడాతో ఘన విజయం

కార్డిఫ్: ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే న్యూజీలాండ్ జట్టుకు శుభారంభం లభించింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌‌లో కివీస్ ఆటగాళ్లు లంక జట్టుతో ఆడుకున్నారనే చెప్పొచ్చు. ఏ దశలోనూ లంక జట్టు ఆటగాళ్లు క్రీజులో కుదురుగా నిలబడే అవకాశం కివీస్ బౌలర్లు ఇవ్వలేదు. దీంతో లంక బ్యాట్స్‌మేన్ విజృంభించడం సంగతి అటుంచితే, తమ వికెట్లను కాపాడుకోవడానికే సమయం సరిపోలేదు. ఒకరి తర్వాత ఒకరుగా వరుస విరామాల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్ బాట పట్టడంతో 16 ఓవర్లు కూడా పూర్తికాకుండానే లంక జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో లంక జట్టు ఒకానొక దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. 

లంక జట్టు పీకల్లోతు కష్టాల్లో వున్న సమయంలో జట్టు కెప్టేన్ దిముత్ కరుణరత్నె (52 నాటౌట్: 84 బంతుల్లో 4x4) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 29.2 ఓవర్లలో లంక జట్టు 136 పరుగులైనా చేయగలిగింది. కుశాల్ పెరీరా(29: 24 బంతుల్లో 4x4), తిశార పెరీరా(27: 23 బంతుల్లో 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రతిభ కనబర్చారు. లంక ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ హెన్రీ(3/29), ఫెర్గుసన్(3/22) గొప్ప‌గా బౌలింగ్ చేశారు. 

అనంతరం 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే సునాయసంగానే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. మార్టిన్ గప్తిల్ (73 నాటౌట్: 51 బంతుల్లో 8x4, 2x6), కోలిన్ మున్రో (58 నాటౌట్: 47 బంతుల్లో 6x4, ఒక సిక్స్) రాణించడంతో 16.1 ఓవర్లలోనే న్యూజీలాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Trending News