బెంగళూరు: కృష్ణప్ప గౌతం.. కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) సర్కిల్స్‌లో సుపరిచితమైన పేరు ఇది. కర్ణాటక ఆల్ రౌండర్‌గా పేరున్న కృష్ణప్ప గౌతం గత రాత్రి షిమోగా (శివమొగ్గ) లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకఛత్రాదిపత్యంతో రెచ్చిపోయాడు. బ్యాట్ పట్టుకున్నా.. బంతి పట్టుకున్నా.. తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు.
బళ్లారి టస్కర్స్ జట్టు తరపున మూడో నంబరు ఆటగాడిగా బరిలోకి దిగిన కృష్ణప్ప గౌతం.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోయాడు. స్టేడియం నలువైపులా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ.. షిమోగా లయన్స్‌కి చెమటలు పట్టించాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న కృష్ణప్ప గౌతం.. 13 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 134 పరుగులు చేశాడు. దీంతో బళ్లారి టస్కర్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 17 ఓవర్లలో 203 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ 17 ఓవర్లకు కుదించారు.
లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కి దిగిన షిమోగా లయన్స్ జట్టును గౌతం ఈసారి బంతితో బెదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన గౌతం.. కేవలం 15 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా షిమోగా లయన్స్ జట్టు 16.3 ఓవర్లకే 133 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో బళ్లారి టస్కర్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కేపిఎల్ టీ20కి అధికారికంగా టీ20 స్టేటస్ లేకపోవడంతో గౌతం బద్ధలుకొట్టిన రికార్డులన్నీ టీ20 రికార్డులకెక్కే వీలులేకపోయింది. లేదంటే.. టీ20 మ్యాచ్‌ల్లో ఇది ఒక ప్రపంచ రికార్డుగా నిలిచిపోయేది. అంతేకాకుండా సౌతాఫ్రికన్ ఆల్ రౌండర్ కొలిన్ ఆకర్‌మన్ ఇటీవలే సాధించిన 7/18 రికార్డు ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయేదే అంటున్నారు క్రికెట్ పరిశీలకులు.
కేపిఎల్ 2019: 56 బంతుల్లో 134 రన్స్