గుండెపోటుతో పిచ్ పైనే ప్రాణాలు విడిచిన క్రికెటర్

బౌలింగ్ చేయడానికి రెడీగా వున్న 20 ఏళ్ల క్రికెటర్ పద్మనాభ్ బంతిని విసిరేందుకు ప్రయత్నించే క్రమంలో ఉన్నట్టుండి ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. 

Last Updated : Dec 18, 2017, 05:51 AM IST
గుండెపోటుతో పిచ్ పైనే ప్రాణాలు విడిచిన క్రికెటర్

కేరళలోని కాసరగడ్‌లో ఆహ్లాదకరంగా సాగుతున్న అండర్‌ఆర్మ్ క్రికెట్ మ్యాచ్‌లో ఉన్నట్టుండి ఓ అనుకోని విషాదం చోటుచేసుకుంది. బౌలింగ్ చేయడానికి రెడీగా వున్న 20 ఏళ్ల క్రికెటర్ పద్మనాభ్ బంతిని విసిరేందుకు ప్రయత్నించే క్రమంలో ఉన్నట్టుండి ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. 

పద్మనాభ్ కిందపడిపోవడం గమనించిన ఎంపైర్లు, తోటి ఆటగాళ్లు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చి అతడికి ఏమైందో తెలుసుకుని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ భరించలేని గుండె నొప్పితో కిందపడి గిలగిల కొట్టుకుంటున్న ఆ యువ ఆటగాడు.. వారికి తన ప్రాణాలు రక్షించే అవకాశాన్ని ఇవ్వకుండానే ప్రాణాలు విడిచాడు. 

 

అప్పటి వరకు ఆటగాళ్ల జోష్‌తో, అభిమానుల కేరింతలతో సందడిగా కనిపించిన ఆ క్రికెట్ స్టేడియంలో పద్మనాభ్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. న్యూస్ 9 కథనం ప్రకారం మైదానంలో క్రికెటర్ పద్మనాభ్ మృతి చెందడంపై మంజేశ్వర పోలీసు స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. పద్మనాభ్ మృతి వార్త మైదానంలో ఆట ఆడుతూ గాయాలపాలై మృతి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను గుర్తుచేసింది. 

2015లో అంకి కేస్రీ అనే ఓ యువ ఆటగాడు ఫీల్డింగ్ చేస్తూ బంతిని పట్టుకునే క్రమంలో తనకి తెలియకుండానే మరో ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. ఒకరినొకరు బలంగా ఢీకొన్న ఈ ఘటనలో అంకి కేస్రీ తలకి బలమైన గాయాలయ్యాయి. ఈ గాయాలతోనే ఆస్పత్రిపాలైన అంకి కేస్రీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. అండర్ 19 టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన కేస్రీ మృతి అప్పట్లో క్రీడావర్గాలను షాక్‌కు గురిచేసింది. ఇదిలావుంటే, అంకి కేస్రీ మృతికన్నా సరిగ్గా ఓ ఏడాది ముందే ఫిల్ హూగ్స్ అనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైతం తలకి బౌన్సర్ తగిలిన కారణంగా ఆస్పత్రి పాలై తుదిశ్వాస విడిచిన ఘటన మరోసారి కళ్లముందు కదలాడింది.

 

Trending News