RR vs SRH IPL 2023 Highlights: హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్.. రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో హైదరాబాద్ విక్టరీ

Sunrisers Hyderabad won by 4 wickets Vs Rajasthan Royals: సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను 4 తేడాతో ఓడించింది. చివరి ఓవర్‌లో చివరి బంతికి అబ్దుల్ సమాద్ సిక్సర్ బాది హైదరాబాద్‌కు తిరుగులేని విజయాన్ని అందించి ప్లే ఆఫ్ రేసులో నిలబబెట్టాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 8, 2023, 12:26 AM IST
RR vs SRH IPL 2023 Highlights: హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్.. రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో హైదరాబాద్ విక్టరీ

Sunrisers Hyderabad won by 4 wickets Vs Rajasthan Royals: ఐపీఎల్‌లో మరో హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ అద్భుతం చేసింది. చివర్లో అదృష్టం కూడా తోడవ్వడంతో రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమాద్ మెరుపులు మెరిపించి జట్టును గెలిపించారు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం అవ్వగా అబ్దుల్ సమాద్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద బట్లర్ క్యాచ్ పట్టాడు. రాజస్థాన్ జట్టు సంబరాల్లో కూడా మునిగిపోయింది. కానీ అంపైర్ ట్విస్ట్ ఇస్తూ నోబాల్‌గా ప్రకటించారు. అదృష్టం కలిసి రావడంతో చివరి బంతి ఫ్రీహిట్‌ను సమాద్ సిక్సర్‌గా మలిచి ఎస్‌ఆర్‌హెచ్‌కు చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

 

హైదరాబాద్‌ ముందు 215 పరుగుల లక్ష్యం. ప్రత్యర్థి జట్టులో హేమాహేమీ బౌలర్లు. హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందే ఓటమి ఖాయమని ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో హైదరాబాద్‌ తొలి వికెట్‌ పడింది. అన్మోల్‌ప్రీత్ 25 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 65 పరుగులను జోడించారు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసిన  అభిషేక్‌ను ఆర్.అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. 

అనంతరం త్రిపాఠికి జత కలిసి క్లాసెన్ మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు. క్లాసెన్ 12 బంతుల్లోనే 26 పరుగులు చేసిన క్లాసెన్‌ను చాహల్ ఔట్ చేసి దెబ్బతీశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 157 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్ వేసిన చాహల్ ఒక్కసారిగా మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. రెండో బంతికే రాహుల్ త్రిపాఠి (47, 29 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఔట్ చేశాడు. ఐదో బంతికి కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ (6)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో హైదరాబాద్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి ఉంది. 19 ఓవర్ కుల్దీప్ యాదవ్ వేయగా.. తొలి నాలుగు బంతుల్లో గ్లెన్ ఫిలిప్స్ 22 పరుగులు చేశాడు. మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి.. నాలుగో బంతికి బౌండరీ బాదాడు. అయితే ఐదో బంతికి ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి. 

చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. సందీప్ శర్మ బౌలింగ్‌కు వచ్చాడు. మొదటి బంతికి సమాద్ 2 పరుగులు చేయగా.. రెండో బాల్‌ను సిక్సర్‌గా మలిచాడు. తరువాత మూడు బంతులకు 4 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. స్ట్రైక్‌లో అబ్దుల్ సమాద్ ఉన్నాడు. సందీప్ యార్కర్ వేయగా.. సమాద్ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్‌ వద్ద బట్లర్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో సందీప్ శర్మతో పాటు రాజస్థాన్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా.. ఎస్ఆర్‌హెచ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సమయంలో అంపైర్ ట్విస్ట్ ఇచ్చారు. నోబాల్‌గా ప్రకటించారు. రీప్లైలో సందీప్ శర్మ నోబాల్ వేసినట్లు క్లియర్‌గా తేలింది. మరో అవకాశం రావడంతో అబ్బుల్ సమాద్ ఎలాంటి పోరపాటు చేయకుండా చివరి బంతి ఫ్రీహిట్‌ను సిక్సర్‌ బాది హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సమద్ 7 బంతుల్లో 17 పరుగులు, జాన్సన్ 2 బంతుల్లో 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (95, 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో  సెంచరీ చేజార్జుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (66 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. యశస్వి జైశాల్ 35 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్‌కు ఆరో ఓటమి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఓడిపోయింది. 

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News