CSK vs SRH Highlights: కసి తీర్చుకున్న చెన్నై.. చేతులారా చేజార్చుకున్న హైదరాబాద్‌

IPL Live Chennai Super Kings Won Against Sunrisers Hyderabad In MA Chidambaram Stadium: కీలకమైన దశలో ప్రయోగానికి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంత గడ్డపై తిరుగులేని విజయం సాధించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 28, 2024, 11:53 PM IST
CSK vs SRH Highlights: కసి తీర్చుకున్న చెన్నై.. చేతులారా చేజార్చుకున్న హైదరాబాద్‌

CSK vs SRH Highlights: టాటా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కసి తీర్చుకుంది. హైదరాబాద్‌ గడ్డపై జరిగిన మ్యాచ్‌లో పరాజయం ఎదుర్కొన్న చెన్నై తన సొంత మైదానంలో హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగి అందరినీ విస్మయపరిచిన హైదరాబాద్‌ కీలకమైన మ్యాచ్‌ను చేతులారా చేజార్చుకుంది. ఛేదనలో విఫలం కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నించగా చేదు ఫలితమే ఎదురైంది. ఫలితంగా చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 78 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

Also Read: GT vs RCB Highlights: భళా బెంగళూరు.. విల్‌ జాక్స్‌, కోహ్లీ బ్యాటింగ్‌ బీభత్సంతో గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయం
 

టాస్‌ నెగ్గి హైదరాబాద్‌ బౌలింగ్‌కు దిగడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇదే అద్భుత అవకాశంగా భావించి రెచ్చిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పరుగుల వరద పారించినా తృటిలో శతకం కోల్పోయాడు. 54 బంతుల్లో 98 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అజింక్యా రహనే 9 పరుగులకే పరిమితమవగా.. డేరిల్‌ మిచెల్‌ గైక్వాడ్‌కు సహకరిస్తూనే 52 పరుగులు చేశాడు.

శివమ్‌ దూబే 39 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్‌లో ధోనీ 5 పరుగులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరోసారి హైదరాబాద్‌ బౌలర్లు విఫలమయ్యారు. పరుగులకు కళ్లెం వేయడంలోనూ.. వికెట్లు తీయడంలోనూ నిరాశపర్చారు. అతి కష్టంగా భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 

Also Read: RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరు

లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోరంగా విఫలమైంది.  బ్యాటర్లు చేతులెత్తేయడంతో 18.5 ఓవర్లకు 134 పరుగులు చేసి కుప్పకూలింది. 78 పరుగుల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది.టాప్‌ స్కోరర్‌గా సత్తా చాటిన ట్రావిస్‌ హెడ్‌ (13)తోపాటు అభిషేక్‌ శర్మ (15)  పూర్తిగా నిరాశపర్చారు. అన్మోత్‌ప్రీత్‌ సింగ్‌ డకౌటవగా.. ఐడెన్‌ మర్‌క్రమ్‌ మైదానంలో నిలబడి కొంత పోరాడాడు. అతికష్టంగా 26 పరుగుల్లో 32 చేసి టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. అనంతరం వచ్చిన బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే మైదానం వీడారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (15), హెన్రిచ్‌ క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (19), షబాజ్‌ అహ్మద్‌ (7), పాట్‌ కమిన్స్‌ (5), భువనేశ్వర్‌ కుమార్‌ (4) అతి తక్కువ స్కోర్‌ చేసి మ్యాచ్‌ను చేజార్చారు.

చెన్నై బౌలర్లు మరోసారి సత్తా చాటారు. 78 పరుగులు మిగిలి ఉండగానే హైదరాబాద్‌ను కుప్పకూల్చారు. తుషార్‌ దేశ్‌పాండే సన్‌రైజ్స్‌ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కీలకమైన 4 వికెట్లు తీసి హైదరాబాద్‌ ఓటమికి బాటలు వేశాడు. అనంతరం ముస్తఫిజర్‌ రహమాన్‌, మతీష పతిరణ రెండు వికెట్ల చొప్పున తీయగా.. జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీసి తమ బాధ్యత తీర్చుకున్నారు.

కొంపముంచిన టాస్‌
ఐపీఎల్‌ చరిత్రలోనే మూడు అత్యధిక స్కోర్లు చేసి మ్యాచ్‌లను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తాజా మ్యాచ్‌లో ఘోరమైన తప్పటడుగు వేసింది. టాస్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. టాస్‌ నెగ్గిన పాట్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌ కాకుండా అనూహ్యంగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం అందరినీ విస్మయపరిచింది. ఆర్‌సీబీ చేతిలో పరాభవం తర్వాత వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 300 రికార్డు నమోదు చేస్తారనుకుంటే కమిన్స్‌ నిర్ణయం విస్మయపరిచింది.

ఛేదన చేసి విజయం సాధిస్తామని నిరూపించేందుకు కమిన్స్‌ ఫీల్డింగ్‌ తీసుకున్నాడని తెలుస్తోంది. 9 మ్యాచ్‌లాడి ఐదు విజయాలు, 4 ఓటములతో హైదరాబాద్‌ నాలుగో స్థానానికి పడిపోగా.. అదే ఫలితాలతో ఉన్న చెన్నై మాత్రం ఒకడుగు ముందుకువేసి మూడో స్థానంలో స్థిరపడింది. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పును తిరిగి చేయకుంటే హైదరాబాద్‌ తిరిగి కోలుకునే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News