టీమిండియా క్రికెటర్ హార్థిక్ పాండ్య స్వెడిష్-గ్రీక్ బ్యూటీ ఎల్లి అవ్రమ్‌తో ప్రేమలో పడినట్టు ఇటీవల పలు పుకార్లు షికార్లు చేశాయి. అందుకు కారణం ఆ ఇద్దరూ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో కలిసి కనిపించడమే. హార్థిక్ పాండ్య సోదరుడి పెళ్లిలోనూ ఎల్లి అవ్రమ్ ప్రత్యక్షమడంతో ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టయింది. అయితే, ఆ పుకార్లలో ఎంత మేరకు నిజం ఉందనే సంగతి ఇంకా రుజువు కాకముందే తాజాగా హర్థిక్ పాండ్య మరో హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ గుప్పుమంటున్నాయి. డీఎన్ఏఇండియా.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం హర్థిక్ పాండ్య ప్రస్తుతం ఈషా గుప్తతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఓ పార్టీలో కలుసుకున్న ఈ ఇద్దరూ అప్పటి నుంచి డేటింగ్ మొదలుపెట్టినట్టుగా ఆ కథనం పేర్కొంది. కాకపోతే ప్రస్తుతానికి ఆ ఇద్దరూ ఈ విషయంలో గోప్యతను పాటిస్తున్నట్టు సమాచారం.
ఒకరినొకరు అర్థం చేసుకునే పనిలో బిజీగా వున్న ఈ ఇద్దరూ వీలున్నప్పుడల్లా లంచ్ పార్టీలు, డిన్నర్ పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అటు పాండ్య కానీ లేదా ఇటు ఈషా గుప్త కానీ అధికారికంగా స్పందించలేదు. బాలీవుడ్ హీరోయిన్స్, క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. ఇటీవలే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, జహీర్ ఖాన్-సాగరిక ఘట్గే జంటలు సైతం పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సంగతి తెలిసిందే.