#CWG 2018: భారత్‌కు మరో మూడు పతకాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది.

Last Updated : Apr 9, 2018, 10:19 PM IST
#CWG 2018: భారత్‌కు మరో మూడు పతకాలు

గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు దక్కాయి. సోమవారం కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు చెందిన జితూరాయ్, ఓం ప్రకాశ్ మిథార్వాల్ బంగారు, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ప్రదీప్‌సింగ్‌కు రజత పతకం వచ్చింది.

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2018లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రెండు పతకాలు వచ్చాయి. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో జితూరాయ్‌కు స్వర్ణ పతకం రాగా, మితర్వాల్‌కు కాంస్యం పతకం వచ్చింది. అలాగే వెయిట్‌లిఫ్టింగ్‌ 105 కేజీల విభాగంలో ప్రదీప్‌సింగ్‌కు రజత పతకం వచ్చింది. ఇప్పటి వరకు భారత్‌కు 8 స్వర్ణాలు, 3 రజతం, 4 కాంస్య పతకాలు దక్కాయి.

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2018లో పురుషుల 10m ఎయిర్ పిస్టల్ విభాగంలో, రాయ్ మొత్తం 235.1 పాయింట్లతో కొత్త ఆట రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో తొలిసారిగా మిథార్వాల్ 214.3 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు15 పతకాలు వచ్చాయి.

ఈ స్వర్ణ పతకంతో ప్రస్తుతం భారత్, పతకాల పట్టికలో 3 వ స్థానంలో (8  స్వర్ణాలు, 3  రజతం, 4  కాంస్యం) కొనసాగుతోంది. 31  స్వర్ణాలు, 26  రజతాలు, 28  కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 19 స్వర్ణాలు, 19  రజతాలు, 10 కాంస్యాలతో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో.. భారత్ తర్వాతి స్థానాల్లో  కెనడా, స్కాట్లాండ్, న్యూజిలాండ్, వేల్స్, సైప్రస్, మలేషియా దేశాలు (టాప్-10లో)ఉన్నాయి.

ఆదివారం జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 16 ఏళ్ల మనూ భాకర్‌కు స్వర్ణ పతకం రాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హీనా సిద్ధుకు రజతం దక్కింది. రవి కుమార్ పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో కాంస్య పతకం సాధించారు. నివేదికల ప్రకారం..  షూటింగ్ విభాగంలో భారత్‌కు ఐదు పతకాలు దక్కాయి.

Trending News