Cheteshwar Pujara will be Team India vice-captain for WTC Final 2023: ఐపీఎల్ 2023 అనంతరం భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్ ఆడనున్న విషయం తెలిసిందే. లండన్‌లోని ఓవల్‌లో జూన్ 7 నుంచి ఆరంభం అయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టుని రోహిత్ శర్మ నడిపించనున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న 'నయా వాల్' ఛతేశ్వర్ పుజారాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక బాధ్యతలు అప్పగించనుందట. ఫైనల్ నేపథ్యంలో రోహిత్‌కు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఫైట్ జరగనుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే వైస్ కెప్టెన్‌గా మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. ఛతేశ్వర్ పుజారాతో పాటు ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శనతో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే రేసులో ఉన్నాడు. రహానే, పుజారాలలో ఒకరిని రోహిత్ శర్మ డిప్యూటీని చేస్తారంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ పుజారానే భారత జట్టు వైస్ కెప్టెన్ అని చెప్పాడు.
'ఛతేశ్వర్ పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. అందరికీ ఈ విషయం తెలుసు. కానీ పుజారా నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 కోసం జట్టు వివరాలు ఐసీసీకి సమర్పించే సమయం (మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్‌గా చేర్చుతారు. కౌంటీ జట్టు ససెక్స్ కెప్టెన్‌గా పుజారా అద్భుతంగా రాణిస్తున్నాడు. పూజి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం' అని బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2023 సందర్భంగా భారత జట్టుకు ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆపై కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్బుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. వరుసగా 115, 35, 18, 13, 151, 136, 77 పరుగులతో కౌంటీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2023 మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్‌కు చేరుకోనున్నారు. అయితే పుజారా కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నాడు.
భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
Also Read: Tata Nexon Facelift: మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్ లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Cheteshwar Pujara Vice Captain: టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ పుజారా!